పర్యాటకులకు గుడ్ న్యూస్. కరోనాకు ముందు ఎలాగో ఇప్పుడూ అలాగే. అండమాన్ నికోబార్ దీవులకు హాయిగా వెళ్లొచ్చు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయి ఉండాలి. ఆర్ టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ వంటి అవసరాలు లేకుండా ఈ ద్వీప ప్రాంత సౌందర్యాలను చూసిరావొచ్చు. ఈ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన 15 రోజుల తర్వాత పోర్ట్ బ్లెయిర్ లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే ఎలాంటి లక్షణాలు లేనివారికే ఇవి వర్తిస్తాయి.
అండమాన్ నికోబార్ సందర్శనకు వెళ్ళిన వారికి ఎవరికైనా ఏమైనా కోవిడ్ లక్షణాలు కన్పిస్తే మాత్రం అక్కడ ఆర్ టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అది వ్యాక్సిన్ తీసుకున్న వారికి అయినా సరే. అయితే ఒక డోస్ తీసుకున్న వారు..అసలు వ్యాక్సినేషన్ తీసుకోని వారు మాత్రం విధిగా ఆర్ టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది..అంతే కాదు..అక్కడ విమానాశ్రయంలో కూడా మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన అండమాన్ నికోబార్ లో కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కేవలం 17 కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి.