బిల్ గేట్స్ వ్య‌వ‌సాయం..ఎన్ని ల‌క్షల ఎక‌రాలో తెలుసా?

Update: 2021-06-11 16:30 GMT

ప్ర‌పంచంలోని సంప‌న్నుల్లో బిల్ గేట్స్ ఒక‌రు. ఆయ‌న పేరు చెపితే వెంట‌నే గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్. దీని త‌ర్వాత ఆయ‌న పౌండేష‌న్ ద్వారా చేసే సేవా కార్య‌క్ర‌మాలు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వివాదాలు. తాజాగా ఆయ‌న విడాకుల వ్య‌వ‌హారం ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇప్పుడ బిల్ గేట్స్ కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అంశం వెలుగుచూసింది. అదేంటి అంటే ఆయ‌న ఏకంగా అమెరికాలో 2.68 ల‌క్షల ఎక‌రాల్లో వ్య‌వ‌సాయం చేస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ వెలుగుచూడ‌ని కోణం ఇది. బిల్ గేట్స్ అమెరికా అతిపెద్ద రైతుల్లో ఒకరు. బిల్ గేట్స్, అతని భార్య మెలిండా గేట్స్ 18 అమెరికన్ రాష్ట్రాలలో 2,69,000 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ల్యాండ్ రిపోర్ట్, ఎన్ బీసీ రిపోర్ట్ ప్రకారం.. గేట్స్ లూసియానా, నెబ్రాస్కా, జార్జియా ఇతర ప్రాంతాలలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నార‌ని తేలిపింది. నార్త్ లూసియానాలోనే గేట్స్‌కు 70,000 ఎకరాల భూమి ఉందని, అక్కడ సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, బియ్యం పండిస్తున్నారు.

నెబ్రాస్కాలో ఉన్న 20,000 ఎకరాలలో అక్కడ రైతులు సోయాబీన్ పండిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇంకా జార్జియాలో ఉన్న 6000 ఎకరాలు, వాషింగ్టన్ లో ఉన్న 14,000 ఎకరాల వ్యవసాయ భూములలో బంగాళాదుంపలను పండిస్తున్నారు. ఒకసారి గేట్స్‌ను రెడిట్‌లోని తన వ్యవసాయ భూముల గురించి అడిగినప్పుడు దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.. "ప్రస్తుత ప్రపంచంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనది. ఎక్కువ మొత్తంలో పంటలు పండించడం ద్వారా అటవీ నిర్మూలనను నివారించవచ్చు. అలాగే ఆఫ్రికా వంటి దేశాలలో ఎదుర్కొంటున్న వాతావరణ ఇబ్బందులను, ఆహార సమస్యను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది" అని అన్నారు. బిల్ గేట్స్ , మెలిండా వ్యవసాయ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్ర‌ముఖ సంస్థ మెక్ డోనాల్డ్స్ త‌మ ఉత్ప‌త్తుల్లో వాడే బంగాళ‌దుంప‌ల‌ను బిల్ గేట్స్ పొలాల నుంచే సేక‌రిస్తుంద‌ని ఎన్ బీసీ క‌థ‌నం పేర్కొంది.

Tags:    

Similar News