ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝన్ వాలా కు చెందిన ఆకాశ ఎయిర్ లైన్స్ గననయానానినికి రెడీ అయింది. ఇప్పటికే ఈ ఎయిర్ లైన్స్ టిక్కెట్ అమ్మకాలు ప్రారంభించింది. గత నెలలోనే ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన తొలి విమానం డెలివరి అయిన విషయం తెలిసిందే. ఆగస్టు7 నుంచి ముంబయ్- అహ్మదాబాద్ మార్గంలో ఈ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్, ముంబయ్, కొచ్చి, బెంగుళూరు మార్గాల్లో విమాన టిక్కెట్ల అమ్మకం ప్రారంభించారు. ముంబయ్- అహ్మదాబాద్ మధ్య 28 వీక్లి ఫ్లైట్స్ నడపనున్నారు. ఆగస్టు 13 నుంచి బెంగుళూరు-కొచ్చి మధ్య కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో ఆకాశ ఎయిర్ లైన్స్ తన సర్వీసులకు శ్రీకారం చుడుతోంది. రెండవ విమానం ఈ నెలాఖరు నాటికి కంపెనీ చేతికి రానుంది.
దశల వారీగా ఆకాశ ఎయిర్ లైన్స్ ఇతర ప్రధాన నగరాలకు కూడా తన సర్వీసులను విస్తరించనుంది. మొత్తం 72 మ్యాక్స్ విమానాల కోసం ఆకాశ ఎయిర్ లైన్స్ బోయింగ్ తో ఒప్పందం చేసుకుంది. అన్ని రిస్క్ లను గమనంలోకి తీసుకునే తాను ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టానని కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో రాకేష్ ఝున్ ఝున్ వాలా స్పష్టం చేశారు. తమ ఎయిర్ లైన్స్ ను లాభాల బాట పట్టించగలననే నమ్మకం తనకుందని..ఈ విషయంలో తన ఆలోచనలు తనకు ఉన్నాయని తెలిపారు. భారత విమానయాన రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన ధీమాగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఆకాశ ఎయిర్ లైన్స్ కు విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ జారీ చేసింది.