ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్స్ సమర్పించేందుకు చివరి తేదీ డిసెంబర్ 14. అంటే ఈ సోమవారమే. అయితే ఇప్పటికే దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన టాటాతోపాటు అదానీ, హిందుజా గ్రూప్ లు కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. వీళ్ళతో పాటు ఎయిర్ ఇండియాకు చెందిన 200 మంది ఉద్యోగులు కూడా బిడ్ సమర్పించేందుకు రెడీ అయినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు ఎయిర్ ఇండియా టాటాలదే కావటం విశేషం. ఇప్పుడు అదే టాటాలు తిరిగి ఈ సంస్థను దక్కించుకునేందుకు రెడీ అయ్యారు. గత కొంత కాలంగా అనూహ్యంగా విమానాశ్రయాల అభివృద్ధి రంగంలోకి అడుగుపెట్టింది అదానీ గ్రూప్.
ఇప్పుడు ఏకంగా ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు కూడా బిడ్ వేసినట్లు వార్తలు రావటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలుమార్లు ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి తేదీలను పలుమార్లు మార్చారు. అయితే ఇప్పటికే టాటాలు తమ ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం. బిడ్డర్లు ఎయిర్ లైన్ ఎంటర్ ప్రైజ్ వ్యాల్యూను కోట్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. టాటాలు ఎయిర్ ఏషియా ఇండియా ద్వారా ఈ బిడ్స్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇందులో ప్రధాన వాటా టాటాలదే అన్న విషయం తెలిసిందే.