ప్రస్తుతం దేశంలోని ఐటి ఉద్యోగులను కలవరపెడుతున్న అంశాలు రెండు. ఇందులో ఒకటి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు...ఆయన వ్యవహరిస్తున్న తీరు అయితే..రెండవది ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ). ట్రంప్ ఎలాగంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా భారతీయ టెక్ నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలోని దిగ్గజ కంపెనీలకు భారతీయ ఐటి నిపుణులను నియమించుకోవద్దు..తొలి ప్రాధాన్యత అమెరికన్స్ కే ఇవ్వాలని ఆయన బహిరంగంగానే చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను కంపెనీలు ఎంత మేర అమలు చేస్తాయి అనే విషయం సంగతి అటుంచితే ఆయన ప్రకటన మాత్రం కొత్తగా ఉద్యోగాల వేటలో ఉన్న వాళ్లనే కాకుండా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను కూడా కలవరపెడుతున్నాయి. అమెరికాలోని దిగ్గజ ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పదిహేను వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇండియా లోని నంబర్ వన్ ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కూడా అదే పని చేసింది. టిసిఎస్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 12000 మందిని తీసివేయబోతున్నట్లు తెలిపింది. దీని కారణంగా సీనియర్ గ్రేడ్స్ తో పాటు మధ్య తరహా ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని కంపెనీ సీఈఓ కృతివాసన్ ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఈ ఉద్యోగుల తొలగింపునకు ఏఐ ఒక్కటే కారణం కాదు అని...ఉద్యోగుల నైపుణ్యాలు కూడా సమస్యగా ఉంది అన్నారు.
మరో వైపు హై క్వాలిటీ టాలెంట్ కోసం చూస్తున్నట్లు తెలిపారు. మార్జిన్లపై ఒత్తిడి తగ్గించుకునేందుకు దేశంలో ఇతర ఐటి కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో టిసిఎస్ బాట పట్టే అవకాశం ఉంది అని అంచనా. ఒక వైపు ఐటి రంగంలోని ఉద్యోగులను ఏఐ కలవరపెడుతున్నా ఈ ఐదు విభాగాల్లోని ఇంజనీర్లకు మాత్రం ఢోకా ఉండదు అని నిపుణులు చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళు పని చేస్తున్న విబాగాలే. ఏఐ టెన్షన్ ఉన్నా కూడా ఇప్పుడు సేఫ్ జాబ్స్ జాబితాలో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉన్నారు. ఎందుకంటే డేటా చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదాలు పొంచి ఉండటంతో ఈ విభాగంలో నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డేటా చోరీకి సంబంధించి పొంచి ఉన్న ప్రమాదాలకు ఏఐ గుర్తించినా కూడా ఇక్కడ ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించటానికి మాత్రం ఇందులో అనుభవం ఉన్న మానవనరుల అవసరం ఎంతో కీలకం అవుతుంది.
వీళ్ళతో పాటు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క అని ఐటి రంగంలోని నిపుణులు చెపుతున్నారు. ప్రధానంగా ఇంటర్నెట్ అఫ్ థింగ్స్(ఐఓటి), ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నట్లు జాబ్ మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ విభాగంలో నైపుణ్యం ఉన్న మానవ వనరులు లేకుండా..ఏఐపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఉండదు అన్నది వీళ్ళ భావన. రోబోటిక్ ఇంజనీర్స్ కూడా ఏఐ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాబోయే పదేళ్ల కాలం వీళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది అని ఐటి నిపుణులు అంచనా వేస్తున్నారు. అధునాతన రోబోటిక్ వ్యవస్థలను రూపొందించడానికి, నిర్మించడానికి, వీటిని నిర్వహించడానికి రోబోటిక్స్ ఇంజనీర్లు ఎంతో అవసరం. మెకానిక్స్, నియంత్రణ వ్యవస్థలు, ఏఐ ఇంటిగ్రేషన్‌లో వారి నైపుణ్యం కారణంగా ఈ పాత్ర సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఏఐ రోబోటిక్స్‌కు శక్తినిచ్చినప్పటికీ ఈ విభాగంలో ఇంజనీర్లు ఎంతో అవసరం. క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ఈ రంగంలో నిపుణులు ఎంతో కీలకం అవుతారు. క్వాంటం పరిశోధన అధిక సైద్ధాంతిక , ప్రయోగాత్మక స్వభావం అంటే పురోగతికి అవసరమైన సృజనాత్మకత, ఆవిష్కరణలను ఏఐ భర్తీ చేయదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది.
సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ , నిర్వహణ టీం ల మధ్య అనుసంధాన కర్తలగా ఉండే డెవలప్ మెంట్ ఆపరేషన్ ఇంజనీర్స్ కు కూడా ఏఐ కారణంగా పెద్ద ప్రమాదం ఏమి లేదు అని గుర్తించారు. వీళ్ళ పాత్రలో అత్యంత సంక్లిష్టమైన నిర్ణయం తీసుకోవడం, సహకారం , ట్రబుల్ షూటింగ్ ఉంటాయి అని దీనికి వీళ్ళు తప్పని సరి. ఇతర ఐటి ఉద్యోగులు ఏఐ కారణంగా భయపడుతున్నా కూడా సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, డెవలప్ మెంట్ ఆపరేషన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్ ఇంజనీర్స్ మాత్రం ఢోకా లేకుండా ఉండొచ్చు. కొత్తగా ఉద్యోగాలకు ప్రయతిస్తున్న వాళ్ళు ఆయా విభాగాల్లో నైపుణ్యాలు సాధిస్తే వాళ్లకు కూడా జాబ్ మార్కెట్ లో అవకాశాలు దొరికే ఛాన్స్ లు మెరుగు అవుతాయి అని నిపుణులు సూచిస్తున్నారు.