ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మిస్టరీ వీడింది. ఈ ప్రమాదానికి సంబంధించి కాక్ పిట్ డేటా తో పాటు అందుబాటులో ఉన్న వివిధ ఆధారాలను విశ్లేషించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబి) ప్రాధమిక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రచారం జరిగినట్లుగా ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొట్టడం, ఇతర విద్రోహ చర్యలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. జూన్ 12 న ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలడంతో ఒక్కరు తప్ప ఇందులో ప్రయాణిస్తున్న వారు అంతా చనిపోయిన విషయం తెలిసిందే. ఏఏఐబి విడుదల చేసిన ప్రాధమిక నివేదిక ప్రకారం విమాన ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోవటంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్దారించారు. ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్‌పిట్‌లో ఉన్న రికార్డర్‌లో బయటపడింది. ఆ సంభాషణను బట్టి చూస్తే.. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. విమానం వేగం పుంజుకున్న తర్వాత రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా చేసే స్విచ్ లు ఒక దాని వెంట ఒకటి రన్ నుంచి కట్ ఆఫ్ కు మారిపోయాయి.
ఇంధన స్విచ్ ఎందుకు ఆపేశావు అని ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించగా తాను ఆపలేదు అని సమాధానం ఇచ్చారు. ఈ విషయాలు మాత్రమే కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో ఉంది. ఆ వెంటనే ఒక దాని తర్వాత ఒకటిగా రెండు స్విచ్ లను కట్ అఫ్ నుంచి రన్ కు మార్చారు. ఇందులో ఒక స్విచ్ పని చేసినా రెండవది మాత్రం వేగాన్ని అందుకోలేకపోయింది. ఆ వెంటనే ఏటిసికి మే డే మే డే అంటూ సందేశాన్ని పంపారు. విమానంలో పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు ఉండటంతో ప్రమాద సమయంలో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. విమానంలోని వారు, కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థులు, నేలపై ఉన్నవారు కూడా ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యారు. విమాన ప్రమాదానికి సంబంధించిన ఫోటో లు, వీడియో లు కూడా పరిశీలించి నివేదికలో పలు అంశాలు పొందుపర్చారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలడంతో ఒక్కసారి బోయింగ్ విమానాల భద్రతపై మరో సారి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమానం లో ఇంధన కంట్రోల్ స్విచ్ లు ఆటోమేటిక్ గా ఎందుకు ఆఫ్ అయ్యాయి.ఇది ఎయిర్ ఇండియా నిర్వహణ లోపమా? లేక బోయింగ్ లో ఉన్న సాంకేతికలోపమా అన్న విషయం తేలాల్సి ఉంది.