పేటిఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మొదటి సారి లాభాల బాట పట్టింది. గత కొంత కాలంగా భారీ నష్టాలను చవిచూస్తున్న ఈ కంపెనీ 2025 ఏప్రిల్ -జూన్ కాలం లో అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది ఖచ్చితంగా పేటిఎం ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే వార్తే అని చెప్పాలి. పేటిఎం 2021 సంవత్సరం నవంబర్ లో ఐపీఓ కి వచ్చి ఒక్కో షేర్ ను 2150 రూపాయల వద్ద జారీ చేసింది. మార్కెట్ నుంచి కంపెనీ ఏకంగా 18300 కోట్ల రూపాయలు సమీకరించింది. అయితే ఈ కంపెనీ షేర్లు ఆఫర్ ధర కంటే తక్కువకే నమోదు అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పేటిఎం షేర్లు ఐపీఓ ధరను చేరుకోలేదు. అంతే కాదు...పేటిఎం షేర్ల 52 వారాల కనిష్ట ధర 437 రూపాయలు. ఏడాది కాలంలో కంపెనీ షేర్లలో 122 శాతం వృద్ధి నమోదు అయినా కూడా ఇవి ఇంకా ఆఫర్ ధర కంటే ఎంతో దూరంలో ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో మంగళవారం నాడు బిఎస్ఈ లో పేటిఎం షేర్లు 34 రూపాయల లాభంతో 1052 రూపాయల వద్ద ముగిశాయి.
ఎన్నో సవాళ్ళను అధిగమించి కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తోలి త్రైమాసికాన్ని లాభాలతో మొదలు పెట్టడంతో రాబోయే రోజులు కూడా ఈ షేర్ల ధర పెరిగే అవకాశం ఉంది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025 ఏప్రిల్ -జూన్ కాలంలో కంపెనీ 122 . 5 కోట్ల రూపాయలను నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ 839 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవిచూసింది. ఇదే కాలంలో ఆదాయం కూడా 1506 కోట్ల రూపాయల నుంచి 1917 . 5 కోట్ల రూపాయలకు పెరిగింది. కంపెనీ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోగలిగింది. మార్కెటింగ్ వ్యయాలను కూడా కంపెనీ బాగా తగ్గించుకోవటంతో ఈ సారి లాభాల బాట పట్టింది. వివిధ విభాగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ని ఉపయోగించి కంపెనీ నిర్వహణ తీరును మెరుగుపరుచుకుంది.