మూడు నెలలకు 356 కోట్ల నష్టం
అయినా బుధవారం షేర్ ధరలో ఆరు రూపాయల పెరుగుదల
స్టాక్ మార్కెట్ అంటేనే చాలా మందికి ఓ మాయలాగా కన్పిస్తోంది. కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు అదే నిజమే అని నమ్మాలనిపిస్తుంది కూడా. జొమాటో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వటం..ఆ ఇష్యూకి వచ్చిన స్పందన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా. అయితే కంపెనీ వాస్తవ విలువకు..ట్రేడ్ అవుతున్న షేర్ ధరకూ ఏ మాత్రం పొంతనలేదని కూడా కొంత మంది నిపుణులు వెల్లడించారు. అయినా కొనువాళ్ళే ఉంటే షేర్లు పెరుగుతూనే ఉంటాయి. జొమాటో విషయంలోనూ అదే జరుగుతోంది. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత జొమాటో తొలిసారి జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ ఏకంగా 356 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.
అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నష్టం 99.8 కోట్ల రూపాయలు మాత్రమే. విచిత్రంగా కంపెనీ నష్టం భారీగా పెరిగినట్లు లెక్క. ఇంత భారీ స్థాయిలో నష్టాలను ప్రకటించినా సరే బుధవారం నాడు బీఎస్ ఈలో జొమాటో షేరు ధర పెరిగింది. సహజంగా కంపెనీలకు నష్టాలు వస్తుంటే షేర్లు అమ్ముకుని బయటపడదామని చాలా మంది చూస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా జొమాటో కంపెనీ భారీ నష్టాలను ప్రకటించినా షేరు ధర తగ్గకపోగా..ఉదయం పదిన్నర సమయంలో దాదాపు ఆరు రూపాయల లాభంతో 131 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే జూన్ తో ముగిసిన మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన రెవెన్యూ 844.4 కోట్ల రూపాయలకు చేరింది. అదే సమయంలో మొత్తం వ్యయాలు 1259.7 కోట్ల రూపాయలకు పెరిగాయి. కంపెనీ భవిష్యత్ పై అంచనాలతోనే ఎక్కువ మంది ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారనే వారూ ఉన్నారు.