కష్టపట్నం పోర్టు..ముంబయ్ విమానాశ్రయం..ఇప్పుడు గంగవరం
అన్నీ అదానీ గ్రూపు చేతికే
పోర్టు వాటా విక్రయంతో డీవీఎస్ రాజు ఫ్యామిలీకి 3604 కోట్లు
89.6 శాతం అదానీ కంపెనీ చేతుల్లోకి
తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తల కంపెనీలు అన్నీ వరసపెట్టి అదానీ చేతికి ఎందుకు వెళుతున్నాయి. ఇంత కాలం అప్రతిహంగా ఆయా ప్రాజెక్టులను నడిపిన వారు అకస్మాత్తుగా ఎందుకు వీటి నుంచి వైదొలుగుతున్నారు. అసలు దేశ పారిశ్రామిక రంగంలో ఏమి జరుగుతోంది. ఇవి అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఇవే కాదు తెలుగు రాష్ట్రాల్లో అదానీ వేర్వేరు కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. తాజాగా అదానీ పోర్ట్స్ గంగవరం పోర్టును చేజిక్కుంచుకుంది. విచిత్రం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తల కంపెనీలు అన్నీ వరస పెట్టి అదానీ చేతుల్లోకి వెళ్ళటమే. సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున జీవీకె గ్రూప్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
గంగవరం పోర్టుకు సంబంధించి డీవీఎస్ రాజు నుంచి 58.1 శాతం నియంత్రిత వాటాను 3604 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.ఈ వాటాతో గంగవరం పోర్టులో అదానీ పోర్ట్సు వాటా ఏకంగా 89.6 శాతానికి చేరింది. ఇంతకు ముందే అదానీ పోర్ట్స్ వార్ బర్గ్ పింకస్ నుంచి 31.5 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత డీ వీఎస్ రాజు కూడా వాటా అమ్మేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. నియంత్రణా సంస్థల ఆమోదం తర్వాత ఈ పోర్టు తమ చేతికి వస్తుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే అని పారిశ్రామికవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.