కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు

Update: 2026-01-23 08:47 GMT

కేంద్రంలోని మోడీ సర్కారు దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పెద్దలకు గౌతమ్ అదానీ ఎంతో సన్నిహితుడు అని...ఈ కారణంగానే ఆయనకు దేశంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లభిస్తున్నాయి అంటూ విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గతంలోనే లోక్ సభ సాక్షిగా కూడా ఇవే ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ప్రధాని మోడీ ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు అమెరికా అమెరికా కు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) భారత్ కు చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తో పాటు ఆయన సోదరుడి కొడుకు అయిన సాగర్ అదానీలకు అమెరికా న్యాయవాదుల ద్వారా, ఇమెయిల్ ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించాలని ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇప్పుడు కోర్ట్ ను ఆశ్రయించటానికి ప్రధాన కారణం గత 14 నెలలుగా వీళ్లిద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అవటమే.

                                      కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసు లు ఇచ్చేందుకు ఏ మాత్రం సహకరించలేదు అని ఎస్ఈసి ఫెడరల్ కోర్ట్ కు తెలిపింది. ఇక వేరే మార్గం లేక న్యూయార్క్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు దాఖలు చేసిన అభ్యర్థనలో పేర్కొంది. దీని ద్వారా ఫిబ్రవరి 2025 నుంచి అనుసరిస్తున్న ఒప్పంద ఆధారిత మార్గాన్ని వదిలివేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ లో అదానీ గ్రూప్ కంపెనీలు సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ లు దక్కించుకునేందుకు ఇక్కడి అధికారులు..రాజకీయ నాయకులకు దగ్గర దగ్గర 2200 కోట్ల రూపాయల మేర ముడుపులు చెల్లించింది అని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేశారు అనే కారణంతో అదానీ కంపెనీ లపై ఆ దేశంలో కేసు నమోదు అయింది. ఇదే అంశంపై గౌతమ్ అదానీ తో పాటు ఆయన సమీప బంధువు సాగర్ అదానీ పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.వాస్తవానికి ఈ కేసు సెటిల్ చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

                                             ఈ తరుణంలో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న గౌతమ్ టానికి ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపటానికి ప్రయత్నాలు స్టార్ట్ కావటం ఇప్పుడు కీలకంగా మారింది అనే చెప్పాలి. హేగ్ కన్వెన్షన్ ప్రకారం మొదటి సారి వీళ్లకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన సమయంలో ఒక సారి ఈ నోటీసు లపై సీల్ (ముద్ర) లు లేవు అనే కారణంతో తిరస్కరించారు. అయితే ఎస్ఈసి నిబంధనల ప్రకారం నోటీసు లు ఇచ్చేందుకు ఇలాంటి అవసరం లేదు అని వెంటనే సమాధానం ఇచ్చినా కూడా భారత ప్రభుత్వానికి చెందిన న్యాయ వ్యవహారాల విభాగం దీనికి సమ్మతించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ఈసి కి దేశంలోని పారిశ్రామిక వేత్తలకు ఇలా నోటీసు లు జారీ చేసే అధికారం లేదు అన్నట్లు ఉంది అని ఎస్ఈసి అమెరికా కోర్ట్ లో ఫైల్ చేసిన పిటిషన్ లో పేర్కొంది.

                                        భారత ప్రభుత్వం ప్రస్తావించిన నిబంధనకు “హేగ్ కన్వెన్షన్ విధానాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా,” మంత్రిత్వ శాఖ “హేగ్ కన్వెన్షన్‌ను అమలు చేయడానికి, సమన్ల సర్వ్ చేయటం కోసం ప్రయత్నించడానికి ఎస్ఈసికి అధికారం లేదని సూచించినట్లు కనిపించింది” అని కూడా పేర్కొంది. అమెరికా కోర్ట్ ఇచ్చే ఆదేశాల మేరకు ఇప్పుడు గౌతమ్ అదానీ, సాగర్ ఆదానీలకు నోటీసు జారీ అవుతాయా లేదా అన్న అంశం ఆధారపడుతుంది. గత కొంత కాలంగా ఇండియా విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. ఒక వైపు పదే పదే ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి ఫ్రెండ్..సన్నిహితుడు అని చెపుతూనే...మరో వైపు రకరకాల కారణాలతో వాణిజ్య ఒప్పందం ఫైనల్ షేప్ తీసుకోకుండా అడ్డుతగులుతున్నట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా లో అదానీ పై నమోదు అయిన కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. తాజా పరిణామాలతో శుక్రవారం నాడు అదానీ గ్రూప్ షేర్లు భారీ ఎత్తున పతనం అయ్యాయి. దీనికి ప్రధాన కారణం మర్కెట్స్ బేర్ పట్టులో ఉండటంతో పాటు కంపెనీల ఫలితాలపై ఒత్తిడి...ఎస్ఈసి తాజా ప్రయత్నాలు అన్నీ కూడా ప్రభావం చూపించినట్లు నిపుణులు చెపుతున్నారు.

Tags:    

Similar News