అప్పుడూ...ఇప్పుడూ అంతే

Update: 2025-06-24 04:48 GMT

ప్రపంచంలో అన్ని కాల్పుల విరమణ ప్రకటనలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రమే చేస్తారా?. గత కొన్ని రోజులుగా చోటు చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. పెహల్గామ్ లో టెర్రరిస్టులు 25 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఘటనకు ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులను ఇండియా విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ దాడులకు ప్రతిగా పాకిస్థాన్ కూడా డ్రోన్లతో భారత్ పై దాడికి దిగింది. పాకిస్థాన్ పై దాడుల విషయంలో భారత్ స్పష్టమైన ఆధిక్యత చూపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి వచ్చి కాల్పుల విరమణ ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఇండియా తో పాటు పాకిస్థాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

                                                  అందరికంటే ముందు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణ ప్రకటన చేయటం భారత్ లోని మోడీ సర్కారును ఇరకాటంలో పడేసింది. దీనిపై అప్పటిలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అప్పుడు ఇండియా-పాకిస్థాన్ విషయంలో ఎలా అయితే వ్యవహరించారో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం విషయంలో కూడా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. ఈ యుద్ధంలో అమెరికా కూడా నేరుగా భాగస్వామి అయి ఇరాన్ లోని అణు స్థావరాలపై భారీ దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ వైపు నిలబడ్డ సంగతి తెలిసిందే. ఖతార్ , ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై సోమవారం రాత్రి ఇరాన్ దాడికి దిగింది. అయితే ఇవి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయా దేశాల్లో పౌరులతో పాటు ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు అని తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ ఈ రెండు దేశాల మధ్య గత 12 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించారు.

                                         ఇందుకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు తెలిపారు. ‘ఇకపై అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావిస్తున్నా.. జరుగుతుంది కూడా. ఈ 12 రోజుల యుద్ధాన్ని ముగించినందుకు.. ముగించే ధైర్యసాహసాలు, ఇంటెలిజెన్స్‌ను కనబరిచిన ఇరు దేశాలకు శుభాకాంక్షలు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో పోస్ట్ చేశారు. కాల్పుల విమరణ దశలవారీగా జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభిస్తుందని, ఆ తరువాత 12 గంటలకు ఇజ్రాయెల్‌ కూడా దాడులను ఆపేస్తుందని అన్నారు. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు గౌరవిస్తాయని కూడా తెలిపారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ రకరకాలుగా స్పందించింది. అంతే కాదు...ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. దీంతో ట్రంప్ ప్రకటన అమలుకు నోచుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News