జగన్ లేఖపై కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పందించరా?

Update: 2020-10-15 05:20 GMT

రవిశంకర్ ప్రసాద్ మౌనం పంపే సంకేతాలేంటి?!

దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖపై కేంద్రం వైఖరి ఏంటి?. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంతటి సంచలన అంశంపై ఇప్పటివరకూ స్పందించకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?. ఏపీ సీఎం జగన్ వాదనకు బిజెపితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతోందా?. లేక ఈ వైఖరి సరికాదనే అభిప్రాయంతో ఉందా?. జగన్ లేఖపై దేశ వ్యాప్తంగా మీడియాతోపాటు న్యాయనిపుణులు కూడా రెండుగా చీలిపోయినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఎవరికి అనుకూలంగా వారు వాదనలు సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అత్యంత కీలకమైన న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మౌనాన్నే ఆశ్రయించారు. ఇప్పటివరకూ ఆయన దీనిపై ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్ వి రమణ, ఏపీ హైకోర్టుకు చెందిన సీజెతోపాటు పలువురు జడ్జీలపై సంచలన ఆరోపణలు చేస్తూ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. అంతకు కొన్ని రోజుల ముందే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సమావేశం అయ్యారు. సీఎం జగన్ సీజెఐకి రాసిన లేఖపై అక్టోబర్ 6వ తేదీ ఉంది. అంటే ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన రోజు...లేఖ రెడీ అయిన రోజూ ఒకటే అని స్పష్టం అవుతోంది.

బిజెపి, కేంద్రం అండ లేకుండా ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీం జడ్జీతోపాటు హైకోర్టు సీజె, మరికొంత మంది జడ్జీలపై అంతటి సాహసంతో ఆరోపణలు చేయరనే వాదన అధికార వర్గాల్లో బలంగా విన్పిస్తోంది. దీనికి మరింత బలపర్చేలా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంతటి కీలక అంశంపై మౌనాన్ని ఆశ్రయించటంతో ఈ అనుమానాలు మరింత బలోపేతం అవుతున్నాయి. బిజెపి నేతలు కూడా పెద్దగా ఈ అంశంపై స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. దేశ న్యాయవ్యవస్థలోనే కలకలానికి కారణమైన ఇంతటి కీలక అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి స్పందించకపోవటం సరికాదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News