టాలీవుడ్ లో హీరోయిజం అంటే మామూలుగా ఉండదు. హీరో అంటే దర్శక, నిర్మాతలు సహా అందరూ వణికిపోవాల్సిందే. వారు చెప్పింది జరగాల్సిందే. కొంత మంది అయితే కథల్లో కూడా వేలు పెట్టి సినిమాలను ఫట్ మన్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంబినేషన్లు సెట్ అవ్వక టాలీవుడ్ హీరోలు కమెడియన్లు..విలన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వాళ్ళు డేట్ ఇస్తే తప్ప..హీరోతో షూటింగ్ ప్రారంభించలేని పరిస్థితి. కామెడీగా ఉన్నా టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతోంది ఇదే. అయితే ఈ విషయాన్ని ఎవరూ పైకి చెప్పకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కీలక కమెడియన్లు, విలన్లు పలు ప్రాజెక్టులపై సంతకాలు చేశారు. అంటే ఒక్కొక్కరికి అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. అదే హీరోలకు మహా అయితే ఒకట్రెండు సినిమాలో చేతిలో ఉంటాయి ఒకేసారి. కానీ వాళ్ల పరిస్థితి అలా కాదు కదా. అందుకే తేదీల సర్దుబాటు ఓ సవాల్ గా మారింది. దీంతో పలు చిక్కులు వచ్చిపడుతున్నాయి. కరోనా రెండవ దశ తగ్గి...సాధారణ స్థితికి రావటంతో ఈ గ్యాప్ లోనే తమ తమ ప్రాజెక్టులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసుకోవాలని నిర్మాతలు, దర్శకులు రెడీ అయిపోయారు. అందుకే కీలక పాత్రదారుల తేదీల సర్దుబాటు ఇప్పుడు ఓ సమస్యగా మారింది. ఎవరికి వారు కరోనా శాంతించిన వేళ సేఫ్ గా సినిమాలు పూర్తి చేసుకుంటే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్న పరిస్థితిలో హైరానా పడుతున్నారు. అందుకే కమెడియన్ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల తేదీలు సర్దుబాటు కోసం విన్నపాలు చేసుకుంటున్నారు.
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా టీమ్ కూడా కొద్ది రోజుల క్రితం విశాఖ వెళ్లి అక్కడ ఉన్న నటులతో సినిమాలోని వారి పాత్రలకు సంబంధించి చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంటే నటులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి దర్శకులు సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సిన పరిస్థితి. అంతే కాదు..లొకేషన్ల విషయంలో కూడా భారీ ఎత్తున రాజీపడుతున్నారు. తాము అనుకున్న ప్రదేశాలకు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే పర్లేదు అని పని పూర్తి చేసుకుంటున్నారు. కారణం నటులు ఒక చోట నుంచి మరో చోట ప్రయాణించటం..మళ్ళీ మరో షూటింగ్ కు అక్కడకు వెళ్ళటం వంటి వాటితో సమయం వృదా అవుతుందనే భావనలో ఉన్నారు. అయితే హీరోలు షూటింగ్ ల కోసం రెడీగా ఉండి ఇతర నటుల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఇదే మొదటిసారి అని ఈ రంగానికి చెందిన ప్రముఖుడు ఒకరు తెలిపారు. కమెడియన్లు, విలన్లు వస్తే తప్ప హీరోలకు పనిలేదంటే అంతా కరోనా కామెడీ అని సర్దుకోవాల్సిందే మరి హీరోలు కూడా. అన్నింటి కంటే ముఖ్యంగా ఇప్పుడు కాంబినేషన్ సెట్ అవ్వటమే కీలకంగా మారింది. దాని కోసం నిర్మాతలు..దర్శకులు నానా తిప్పలు పడుతున్నారు.