వరదసాయం కోసం టాలీవుడ్ ప్రముఖులకు మంత్రి ఫోన్లు ?!

Update: 2020-10-22 13:52 GMT

తీవ్ర ఒత్తిడిలో టాలీవుడ్

పవన్ ఘాటు వ్యాఖ్యలు అందుకేనా?

టాలీవుడ్ గతంలోఎన్నడూ లేని రీతిలో ఒత్తిడి ఎదుర్కొంటుందా?. వరద సాయం కోసం ఏకంగా ఓ మంత్రి రంగంలోకి దిగారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది టాలీవుడ్ వర్గాల నుంచి. హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ ఎత్తున విరాళాలు ఇవ్వాల్సిందిగా సదరు మంత్రి టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్లు చేస్తున్నారు. ఈ వ్యవహారం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయం ప్రకటిస్తే తీసుకోవాలి కానీ..ఇలా ఫోన్లు చేసి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేయటం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానిస్తున్నారు. సాయం అన్నది ఎవరికి తోచినట్లు వారు చేస్తారు. కానీ ఇప్పుడు సాయం ఎంత చేయాలో 'ఫిక్స్' చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో ప్రభాస్ హైదరాబాద్ వరద బాధితుల సాయం కోసం కోటిన్నర రూపాయలు ప్రకటించారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లు కోటి రూపాయల లెక్కన సీఎంఆర్ఎఫ్ కు సాయం ప్రకటించారు. నాగార్జున, ఎన్టీఆర్ లు ఏభై లక్షలు ప్రకటిస్తే..విజయదేవరకొండ పది లక్షలకు ఏకంగా సీఎంఆర్ఎఫ్ కు బదలాయించేశారు కూడా.

మరికొంత మంది దర్శకులు కూడా తమకు తోచిన సాయం ప్రకటించారు. ఇంకా ప్రకటించాల్సిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లు ప్రకటిస్తారో లేదో కూడా తెలియదు. కానీ మంత్రి నేరుగా రంగంలోకి దిగి విరాళాల కోసం ఫోన్లు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వద్దకు చేరటంతోనే ఆయన ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. సినిమా వాళ్ళ కంటే రాజకీయ నేతలు, మౌలికసదుపాయాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే నేతలు ఇప్పుడు రాజకీయానికి పెట్టుబడి అనుకుని డబ్బు బయటకు తీయాలని అన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూలేని రీతిలో తెలంగాణ అత్యంత కీలకంగా మారిన మౌలిసదుపాయాల కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.

ఏ కంపెనీలు సర్కారుతో సన్నిహితంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఏ ఆపద వచ్చినా తన వంతు సాయం చేస్తూనే ఉందని..కానీ ఇలా ఒత్తిళ్లు చేయటం సరికాదని పరిశ్రమ ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. సాయం అనేది స్వచ్చందంగా ఉండాలి కానీ..ఓ మంత్రి స్వయంగా ఫోన్లు చేసి సాయం ప్రకటించాలని ఒత్తిడి చేయటం సరికాదని అభిప్రాయపడ్డారు. గత ఏడెనిమిది నెలలుగా కరోనా కారణంగా పరిశ్రమలో ఎలాంటి కార్యక్రమాలు లేవనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఒత్తిళ్ళ వ్యవహారం తన దృష్టిక రావటంతో పవన్ కళ్యాణ్ ఇలా స్పందించి ఉంటారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపితో కలసి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయ కోణంలో కూడా ఈ విమర్శలు చేసినట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News