అసెంబ్లీ ఎన్నికల తరహాలో టీఆర్ఎస్ 'జాకెట్ యాడ్స్' ఎటాక్

Update: 2021-03-13 04:10 GMT

కుల సంఘాల పేరుతోనూ గులాబీ ప్రకటనలు

టీఆర్ఎస్ లో టెన్షన్ ను ఈ యాడ్స్ తెలియజేస్తున్నాయా?

చర్చనీయాంశంగా మారిన అధికార పార్టీ వైఖరి

వరస ఓటములతో అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిందా?. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరాజయం పాలైతే ప్రతిపక్షాల దూకుడు మరింత పెరుగుతుందని భయపడుతుందా?. క్యాడర్ లోనూ అసెంబ్లీ ఎన్నికల నాటికి నిస్తేజం ఆవరిస్తుందని ఆందోళన చెంతుందా?. అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. తెలంగాణ ను దేశంలో 'ఎక్కడో' నిలబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇంత హైరానా చేయటం చూస్తుంటే ఆ పార్టీలో టెన్షన్ ఎలా ఉందో స్పష్టంగా కన్పిస్తోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో మంత్రులు, పార్టీ నేతలు వరస పెట్టి సమావేశాలు పెట్టి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్ధించారు. అంతే కాదు..కులాల వారీగా..ఉద్యోగుల విషయానికి వస్తే సంఘాల వారీగా కూడా సమావేశాలు సాగాయి. అంతే కాదు..అందరూ ఒకే తరహాలో అధికార టీఆర్ఎస్ కు 'మద్దతు' ప్రకటనలు చేస్తున్నారు. సహజంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇస్తుంటాయి.

కానీ ఈ సారి అందుకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల కు కూడా అన్ని ప్రధాన పత్రికల్లో వరస పెట్టి జాకెట్ యాడ్స్ నింపేస్తున్నారు. అధికార పార్టీకి నిధుల కొరత లేదు..యాడ్స్ ఇస్తుంది..ఇందులో అభ్యంతరం చెప్పాల్సి ఏమీ లేదు. కానీ ఈ యాడ్స్ తీరు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగిన తీరు చూస్తే అభ్యర్ధులు..పార్టీలు అయినా చిన్న చిన్న యాడ్స్ తో సరిపెట్టేవి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీలోనూ అధికార టీఆర్ఎస్ కు బిజెపి షాకిచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ అదే దూకుడు చూపిస్తోంది.

పలు కారణాలతో ఉద్యోగులతోపాటు నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని తగ్గించేందుకు అధికార పార్టీ పలు ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే రెండున్నర సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందని..దీనికి తోడు విపక్షాలు టీఆర్ఎస్ పని అయిపోయిందని ఇఫ్పటి న చే ఎటాక్ ప్రారంభిస్తాయనే ఆందోళన పార్టీ నేతల్లో ఉందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే ఎప్పుడూలేని రీతిలో ఈ ఎన్నికలను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై కూడా ఈ ప్రభావం తప్పక ఉంటుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యయం అయితే ఎవరూ ఊహించని రీతిలో సాగుతోందని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News