చిరంజీవి ప్రజారాజ్యం చూశారు. పవన్ కళ్యాణ్ జనసేన చూశారు. నాగబాబు 'మా' ఎన్నికల నిర్వహణ చూశారు. ఇవి అన్నీ చూసిన మెగా అభిమానులకు కూడా అసలు ఈ ఫ్యామిలీకి రాజకీయం తెలుసా అనే సందేహం కలగక మానదు. నటన వేరు.రాజకీయం వేరు. నటనలో ఎవరో చెప్పింది చేసిపోతే సరిపోతుంది. కానీ రాజకీయంలో అంతా నాయకుడే నడిపించాలి. లేదంటే పక్కనున్న వాళ్ల మార్గదర్శకత్వం అయినా సరిగ్గా ఉండాలి. లేదంటే విషయాలు తెలిసిన వాడిని అయినా పక్కన పెట్టుకోవాలి. కానీ ఇక్కడ అవేమీ జరిగినట్లు కన్పించటంలేదు. గతంలో ఎన్నడూలేని రీతిలో.. ముఖ్యంగా మీడియా ఈ మా ఎన్నికలను హైలెట్ చేసింది. హైఓల్టేజ్ తో సాగిన ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బలాబలాలు చూస్తే ఏ రకంగా చూసుకున్నా ప్రకాష్ రాజ్ ప్యానల్ అంత బలహీనమైనదేమీ కాదు. అంతేకాదు. చిరంజీవితోపాటు తామంతా ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించటమే కాదు...నాగబాబు మీడియా ముందు పలు వ్యాఖ్యలు కూడా చేశారు. మెగా ఫ్యామిలీలోనే ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ఓటుకు డబ్బులు కూడా పంచుతున్నారని ఆరోపించారు నాగబాబు. అందులో నిజం ఎంతో తెలియదు కానీ..కాసేపు ఇది నిజమే అనుకుందాం. ఆర్ధిక వనరులతో పోలిస్తే ప్రకాఫ్ రాజ్ సినిమాకు కోటి రూపాయలు తీసుకునే నటుడు అని కితాబు ఇచ్చింది కూడా నాగబాబే. అండగా నిలబడటం అంటే తాము మద్దతు ఇస్తామంటూ ఊరికే మాటలు చెప్పి వదిలేయటం కాదు. గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నించాలి కూడా. ఆ లెక్కన ప్రకాష్ రాజ్ రెమ్యునరేషన్, మెగా ఫ్యామిలీ ఆర్ధిక వనరులు ఏమైనా తక్కువా?. ఇవే కాదు..ప్రకాష్ రాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో కూడా అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయనతో కలసి ప్రత్యేక విమానాల్లో పర్యటనలు కూడా చేశారు.
కానీ ఇదే ప్రకాష్ రాజ్ విష్ణుకు జగన్ బంధువు అయితే ఆయన మా ఎన్నికలకు వస్తారా? అని ప్రశ్నించారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ జోక్యం చేసుకున్నారో లేదో తెలియదు కానీ..సీఎం కెసీఆర్ జోక్యం చేసుకుని ఉంటే సినిమా ఖచ్చితంగా వేరేలా ఉండేది. ఎందుకంటే టాలీవుడ్ అంతా కొలువై ఉంది ఇక్కడే కాబట్టి. కానీ టీఆర్ఎస్ హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టి వీటిని అసలు పట్టించుకున్న దాఖలాల లేవు. ఎన్నో సానుకూలతలు ఉన్నా కూడా ప్రకాష్ రాజ్, నాగబాబులు తమ మాటలతో అందరినీ దూరం చేసుకున్నారని ఈ ఎన్నికలను దగ్గర నుంచి పరిశ్రమ వ్యక్తుల అభిప్రాయం. అంతే కాదు ఇదే తరహా మాటల విషయంలో మోహన్ బాబు ముందు వరసలో ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ఎన్నికల సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించారనే చెప్పాలి. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాజకీయం ఎలా ఉంటుందో చూపించారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సొంతంగా దెబ్బతినటమే కాదు..నమ్ముకున్న వాళ్ళను కూడా ఎలా దెబ్బతీస్తారో చెప్పే ఉదాహరణ ఇదొకటి అని ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు.