టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను మంత్రివర్గంలోకి తీసుకొస్తున్నారా?. అందుకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు అత్యంత కీలకమైన ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారా?. అంటే ఔననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఏ మాత్రం అలికిడి లేకుండా అకస్మాత్తుగా సీఎంవో నుంచి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవి ప్రకటన వెలువడింది. ఇతర నామినేటెడ్ పోస్టులతో కాకుండా విడిగా రావటంతో కూడా దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడించింది. జిల్లాలో సీనియర్ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎలాంటి పదవి ఇవ్వకుండా కవితకు మంత్రి పదవి వస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతోనే ముందుగా ఈ వ్యవహరాన్ని సెట్ చేసినట్లు చెబుతున్నారు. గోవర్ధన్ సామాజికవర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కేబినెట్ లోకి కవిత రావటం మాత్రం పక్కా అని ఆ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై ఎమ్మెల్సీ కవిత కూడా తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పదవులు అన్నీ కెసీఆర్ ఫ్యామిలీకేనా అన్న విమర్శలు విన్పిస్తున్న తరుణంలో ఈ కూర్పు ఎలా ఉండబోతున్నది అన్నదే కీలకంగా మారింది. చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా సీఎం కెసీఆర్ తన పదవిని కెటీఆర్ కు అప్పగించి..కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక ఆయన సీఎంగా కొనసాగుతూ కవితను తీసుకోవాలంటే సామాజిక సమీకరణల లెక్కల బ్యాలెన్స్ కోసం వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు డేంజర్ బెల్స్ మోగినట్లే అని చెబుతున్నారు. కారణాలు ఏమైనా గత ఏడేళ్ళ పాలనకు భిన్నంగా సీఎం కెసీఆర్ తాజాగా కాస్త స్పీడ్ పెంచారు. సభలు..సమావేశాలు అంటూ బయటకు వస్తున్నారు. దీంతో గతంలో జరిగిన కెటీఆర్ సీఎం పదవి అన్న ప్రచారం పూర్తిగా వెనక్కిపోయింది.
అయితే ఈ మార్పు జరగటం మాత్రం పక్కా అని..అది ఎప్పుడు అన్నది మాత్రమే సందేహం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఓ వైపు దళితబంధు అంటూ హంగామా చేస్తున్నసీఎం కెసీఆర్ మాదిగలకు తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేకపోయారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే విస్తరణ ఉంటుందని..అయితే ఈ మార్పు సీఎంతో సహా ఉంటుందా లేక...ప్రస్తుతానికి మంత్రివర్గంలో మార్పులకే పరిమితం అయి..తర్వాత కెటీఆర్ ను సీఎం పదవిలోకి తెస్తారా అన్న అంశంపై మాత్రం పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. గతంతో పోలిస్తే తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దళిత, గిరిజన దండోరా యాత్రలు, బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రలతో ఎన్నికల వాతావరణాన్ని ముందే తెచ్చారు. పరిస్థితులు ఎటు తిరిగి ఎటు మారతాయో ఊహించటం కష్టం కాబట్టి కెటీఆర్ కు సీఎం పదవి, కుమార్తె కు మంత్రి పదవులు ఇవ్వాలనే యోచనలో సీఎం కెసీఆర్ ఉన్నారని అంటున్నారు.