సాంకేతికంగా సమస్యలు లేకపోయినా ఆ ఊసెత్తని సర్కారు
జగన్ 'మూడు రాజధానులు' ముందుకు సాగేనా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో అసలు ఏపీకి మూడు రాజధానులు వస్తాయా? అమరావతిలో నెలకొన్న అనిశ్చితి వీడుతుందా?. సీఎం జగన్ చెప్పినట్లు భవనాలు ప్రగతికి చిహ్నాలు కాకపోవచ్చు. కానీ ఓ రాష్ట్ర గుర్తింపునకు ఖచ్చితంగా అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ వంటి భవనాలు ఓ కీలక కేంద్రాలు. హైదరాబాద్ లోని అసెంబ్లీ భవనం, కర్ణాటకలోని సచివాలయం వంటి భవనాలు పర్యాటక కేంద్రాలుగా కూడా ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాయి. ఆయా నగరాలను సందర్శించిన వారు వాటి ముందు ఫోటోలు దిగి ఓ జ్ఞాపకంగా వాటిని ఉంచుకుంటారు. అమెరికా పర్యటన వెళ్లిన వారు వైట్ హౌస్ ముందు ఫోటో దిగకుండా రారంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాధాన్యత ఉంటుంది రాష్ట్ర పరిపాలనా కేంద్రాలకు. అందుకని ఎవరు అవునన్నా..కాదన్నా వాటికి ఉన్న ప్రాధాన్యత కాదలేనిది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తొలి ఐదేళ్ళ తన పాలనా కాలంలో రాజధానిని ఓ దీర్ఘకాలిక ప్రాజెక్టుగా మార్చటంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అసలుకే మోసం వచ్చింది. మరి ఇప్పుడు మూడు రాజధానులు ముందుకు సాగుతాయా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసెంబ్లీలో బిల్లులు అయితే ఆమోదించారు.. ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకెక్కింది.
ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే జగన్ సర్కారు కొద్ది కాలం క్రితం 'అమూల్'తో ఒప్పందం చేసుకుంది. అందులో అమూల్ రైతులకు ఎక్కువ ధర ఇవ్వాలి..అందుకు ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తుంది. ఏదైనా కారణంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు ఆపేస్తే ..అమూల్ కూడా రైతులు ఇచ్చే అధిక ధరలను ఆపేస్తుంది. లేదంటే ఒప్పంద ఉల్లంఘన అంటూ కోర్టును ఆశ్రయిస్తుంది. అలాగే అమరావతి రైతులు కూడా రాజధాని కోసం భూములు ఇచ్చారు. కానీ ఇప్పుడు అసలు అమరావతిలో శాసన రాజధాని తప్ప ఏమీ ఉండదు అని సర్కారు తేల్చింది. అంటే ఖచ్చితంగా ఇది ఏపీ ప్రభుత్వం, అమరావతి రైతుల మధ్య జరిగిన ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుంది. అందుకే అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనికి తోడు ఇప్పుడు ఏపీ ఆర్ధిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితి. ఈ తరుణంలో చంద్రబాబు హయాంలో అమరావతి కోసం అంటూ ఖర్చుపెట్టిన 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల వ్యయం వేస్ట్ గా పడి ఉండటాన్ని కూడా న్యాయస్థానం గమనంలోకి తీసుకుంటుంది. రాజధాని వ్యవహారం న్యాయస్థానం ద్వారా అన్నా పరిష్కారం కావాలి. లేదంటే జగన్ సర్కారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో అయినా సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. రైతులతో సమస్య సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న దాఖలాలు అయితే ఏమీ లేవు. అంతే కాదు..జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో అమరావతిలోనే శాసన రాజధాని ఉంది. అంటే ఇక్కడే అసెంబ్లీ, శాసనమండలి కట్టాలి.
ఈ కొత్త భవనాలు కట్టడానికి సాంకేతికపరంగా చూస్తే ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ ఆ దిశగా జగన్ సర్కారు అసలు ప్రయత్నాలే ప్రారంభించినట్లు లేదు. ఒక వేళ ప్రారంభించినా అవి కూడా చంద్రబాబు హయాంలో సమీకరించిన భూముల్లో కాకుండా హైవే మార్గంలో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన హైకోర్టులో మూడు రాజధానులకు క్లియరెన్స్ వస్తే తప్ప సీఎం జగన్ అసలు రాజధానుల విషయంలో నిర్మాణాలకు ముందుకు కదిలే పరిస్థితి ఉండదు. కోర్టు తేల్చకపోయినా సీఎం జగన్ మాత్రం కొంత కాలం తన ఆఫీసును వైజాగ్ కు మార్చుకుంటారని..ఈ దిశగా పనులు జోరుగా సాగుతున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఈ దిశగా ముందుకు సాగటానికి పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చు కానీ....జగన్ తలపెట్టిన మూడు రాజధానుల కల నెరవేరటం ఈ ఐదేళ్లలో పూర్తవుతుందా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో మదిలో పెద్ద సందేహంగా మారింది. ఇప్పటికే జగన్ పాలన దాదాపు రెండున్నరేళ్ళు పూర్తి కావస్తుంది. చివరి ఏడాది అంతా ఎన్నికల హడావుడే ఉంటుంది. పైగా రాష్ట్రాన్ని ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. జగన్ కూడా రాజధాని విషయంలో ముందుకు సాగలేకపోతే అసలు రాజధాని అనిశ్చితిలో ఆంధ్రప్రదేశ్ పదేళ్ల పాటు కొనసాగినట్లు అవుతుంది.