పండగలకు కూడా బస్సులు నడపరా?
'తెలంగాణ సీఎం కెసీఆర్ చాలా మంచి వ్యక్తి.' గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఓ సాగునీటి ప్రాజెక్టు తలపెట్టినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే తమకు కావాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుకుంటారు కానీ...ప్రజల అవసరాల కోసం మాత్రం మాట్లాడుకోరా?. దేశంలో విమానాలు, రైళ్ళు అన్నీ తిరుగుతున్నాయి. కానీ హైదరాబాద్-విజయవాడల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇఫ్పుడు కూడా అత్యధిక రద్దీ ఉండే రూట్ హైదరాబాద్-విజయవాడ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఏపీకి చెందిన లక్షలాది మంది విద్యా, ఉపాధి అవకాశాలు, వ్యాపారాల కోసం ఇక్కడే స్థిరపడ్డారు. ఏ పెద్ద పండగ వచ్చినా తమ తమ ప్రాంతాలకు వెళ్లి రావటం కామన్. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రతి పండగ సీజన్ లోనూ కిక్కిరిసి పోతుంది. ప్రజలు ఓ వైపు కరోనా కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆర్టీసీ బస్సులు కూడా లేకపోవటం వల్ల విద్యార్ధులు, ఉద్యోగులు పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ప్రైవేట్ బస్సులు, ఇతర రవాణా మార్గాలు వెతుక్కోవటం వల్ల అదనపు వ్యయం అవుతోంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు, ఈడీ స్థాయిలో పలుమార్లు రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల ప్రారంభానికి చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఏపీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కెసీఆర్ ల మద్య సత్సంబంధాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ మీడియా సమావేశంలో కూడా ఓ విలేకరి సీఎం కెసీఆర్ పోతిరెడ్డిపాడుపై ప్రశ్న అడిగితే మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు..అది నీ వల్ల కాదు అంటూ ఆ ప్రశ్న అడిగిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర అంశాలపై తెలంగాణ సీఎం కెసీఆర్ తో మాట్లాడే సీఎం జగన్ లక్షలాది మందికి సంబంధించిన ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభం విషయంలో సీఎం కెసీఆర్ తో ఒక్క మాట మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని..కానీ ఇప్పటివరకూ అది ఎందుకో జరగటంలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ బస్సు సర్వీసులు నిలిచిపోవటం వల్ల రాజకీయంగా కూడా తెలంగాణ సీఎం కెసీఆర్ కంటే..ఏపీ సీఎం జగన్ కే ఎక్కువ నష్టం అని ఓ అధికారి అబిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద అంశాలపై సఖ్యతతో ఉండే వారు బస్సు సర్వీసుల వంటి చిన్న సమస్యపై సీఎం జగన్ జోక్యం చేసుకోలేరా అన్న విమర్శలు విన్పిస్తున్నాయి.