తెలంగాణ ఐటి శాఖ 'ఆయ‌న‌కు రాసిచ్చారా?!'

Update: 2021-12-09 04:14 GMT

జ‌యేష్ రంజ‌న్ త‌ప్ప ఎవ‌రూ ఆ శాఖకు ప‌నికిరారా?

ఆరున్నర సంవ‌త్స‌రాలుగా ఐటి శాఖ‌లో అంతా ఆయ‌నే

విమానం న‌డ‌ప‌టంలో పైల‌ట్ కు అత్యంత కీల‌క‌మైన వ్య‌వ‌హారం టేకాఫ్‌..ల్యాండింగ్ మాత్ర‌మే. ఒకసారి విమానం గాల్లోకి ఎగిరాక ఆ విమానాన్ని ఫ్లైట్ పాత్ లో పెట్టాక పైల‌ట్ కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. అప్పుడు ఆటోమోడ్ లో పెట్టేస్తారు. వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పులు ఉంటేనే పైల‌ట్ కు ప‌ని. లేదంటే ఆ విమానం అలా సాఫీగా గ‌మ్య‌స్థానానికి చేరుకుంటుంది. ఇది అంతా ఎందుకంటే తెలంగాణ‌లో ఐటి రంగం ఆటోమోడ్ లోకి వెళ్లి ద‌శాబ్దంపైనే అయింది. దాన్ని ఎవ‌రూ క‌దిలించ‌కుండా...ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటే చాలు అన్న మాట‌. ఆ రంగం అలా దూసుకెళుతూనే ఉంటుంది. ఇందుకు ఎన్నో బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. అలాంటి అత్యంత కీల‌క‌మైన ఐటి శాఖ‌ను తెలంగాణ స‌ర్కారు ఆరున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్ చేతిలో పెట్టింది. ఐటి శాఖ వ‌ర్గాల మాట‌ల్లో చెప్పాలంటే ఆయ‌న‌కు ఓ ర‌కంగా ఈ శాఖ రాసిచ్చిన‌ట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు. స‌హ‌జంగా కీల‌క శాఖ‌ల్లో ఉన్న‌తాధికారుల‌ను మూడు సంవ‌త్స‌రాల‌కు మించి అక్కడ ఉంచ‌రు. ఎందుకంటే అంత‌కంటే ఎక్కువ కాలం అదే శాఖ‌లో కొన‌సాగిస్తే అందులో లోతుపాతులు తెలిసి అక్ర‌మాల‌కు పాల్ప‌డే ఛాన్స్ ఉంటుంద‌ని అలా చేస్తారు. కానీ తెలంగాణ స‌ర్కారు మాత్రం ఎప్ప‌టి నుంచో ఆటోమోడ్ లో ఉన్న తెలంగాణ ఐటి శాఖ‌లో ముఖ్య కార్య‌దర్శి జ‌యేష్ రంజ‌న్ నే కొన‌సాగిస్తూ ఉంది. ఓ సారి ముఖ్య‌మంత్రి కెసీఆర్ కూడా మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడిని విమ‌ర్శించ‌టానికి ఈ రంగాన్ని వాడుకున్నారు.

హైద‌రాబాద్ ఐటి రంగంలో అద్బుత ప్ర‌గ‌తి సాధించింది అంటే అది ఈ న‌గ‌రానికి ఉన్న భౌగౌళిక అనుకూల‌త‌లు, టాలెంట్ పూల్, మౌలిక‌స‌దుపాయాలు అని వ్యాఖ్యానించారు. అంతే త‌ప్ప‌..ఇందులో చంద్ర‌బాబు గొప్ప‌ద‌నం ఏమీలేద‌ని కెసీఆర్ అప్ప‌ట్లో ఆయ‌న్ను ఎద్దేవా చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయ‌న త‌న‌యుడు, ఐటి శాఖ మంత్రి కెటీఆర్ మాత్రం ఓ స‌మావేశంలో చంద్ర‌బాబు ఐటి రంగానికి చేసిన కృషి మ‌ర్చిపోలేమ‌న్నారు. మ‌రి ఎవ‌రు ఉన్నా కూడా ఆటోమేటిక్ గా న‌డిచే ఐటి శాఖ‌లో ఆరున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఒకే అధికారిని కొనసాగిస్తున్నారంటే అందులో ఖ‌చ్చితంగా ఏవో అనుచిత ప్ర‌యోజ‌నాలు ఉండే ఉంటాయని ఓ సీనియ‌ర్ అధికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు..ఐటి శాఖ‌లో పెద్ద‌గా సంక్లిష్ట అంశాలు కూడా ఏమీ ఉండ‌వు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఐటి విధానం ప్ర‌కారం ఇక్క‌డ ఐటి సంస్థ‌లు ఏర్పాటు చేసే సంస్థ‌ల‌కు రాయితీలు..భూ కేటాయింపులు సాగుతాయి. వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో కూడిన మెగా ప‌రిశ్ర‌మ‌ల‌కు అయితే ప్రభుత్వ‌ విధానంతో సంబంధం లేకుండా ప్ర‌త్యేక రాయితీలు కూడా ఇస్తారు. వీటిని మంత్రివ‌ర్గంలో పెట్టి మ‌రీ నిర్ణ‌యం తీసుకుంటారు.

అలాంటిది సంప్ర‌దాయానికి భిన్నంగా ఐటి శాఖ అంటే జ‌యేష్ రంజన్...జ‌యేష్ రంజ‌న్ ఐటి శాఖ అన్న ప‌రిస్థితి తెచ్చార‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఒక్క ఐటి శాఖే కాదు..అత్యంత కీల‌క‌మైన ప‌రిశ్ర‌మ‌ల శాఖ కూడా కొన్ని సంవ‌త్స‌రాలుగా జ‌యేష్ రంజ‌న్ లో చేతిలోనే ఉంది. మంత్రి కెటీఆర్ కు. జ‌యేష్ రంజ‌న్ కు అంతా బాగా సెట్ అవ‌టం వ‌ల్లే ఆయ‌న నిర్వ‌హించే కీల‌క శాఖ‌లు అయిన ఐటితోపాటు ప‌రిశ్ర‌మ‌ల శాఖ కూడా జ‌యేష్ రంజ‌న్ కు అప్ప‌గించార‌ని చెబుతున్నారు. మంత్రి కెటీఆర్, ఐటి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ లు క‌ల‌సి ప‌లుమార్లు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు కూడా చేసివ‌చ్చారు. తెలంగాణలో పాల‌న అంతా గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో ఓ ఐదారుగురి చేతిలోనే ఉంద‌ని ఐఏఎస్ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అయితే ఇలా సంప్ర‌దాయానికి భిన్నంగా ఒకే అధికారిని సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి అదే శాఖ‌లో కొన‌సాగించ‌టం ఏ మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఓ అదికారి అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags:    

Similar News