దుబ్బాక టీఆర్ఎస్ దే..భారీగా తగ్గనున్న మెజారిటీ!

Update: 2020-11-03 15:21 GMT

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో మంగళవారం నాడు పోలింగ్ ప్రారంభం నుంచే దూకుడు చూపించింది. ఆ దూకుడు చూస్తే ఓటింగ్ శాతం భారీగా ఉండబోతుందనే సంకేతాలు వచ్చాయి. అలాగే మంగళవారం రాత్రి ఏడు గంటల వరకూ దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో ఇది 86 శాతంగా ఉంది. ఒక ఉప ఎన్నికలో ఇంత భారీగా పోలింగ్ నమోదు అవటం విశేషమే. అయితే పార్టీలు అన్నీ ప్రత్యేక ఫోకస్ పెట్టడం కూడా ఓటింగ్ ఈ స్థాయికి చేరటానికి కారణం అయిందనే అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్ కంచుకోటలాంటి దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ కు నల్లేరు మీద నడక కావాలి. కానీ ఇప్పుడు అక్కడ ఆ సీన్ లేదు. సెంటిమెంట్ లేదు. పోటీ మామూలుగా సాగలేదు. తెలంగాణ రాజకీయాల్లో బిజెపి ఎలా చేయబోతుందో దుబ్బాకలో ఓ శాంపిల్ చూపించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భౌతిక దాడులు ఏ మాత్రం సమర్ధనీయం కానప్పటికీ .. సిద్ధిపేట లాంటి జిల్లాలో ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై బిజెపి శ్రేణులు దాడులు చేశాయంటే బిజెపి దూకుడు అర్ధం అవుతోంది.

అడుగడుగునా అధికార పార్టీ నుంచి సవాళ్లు ఎదురైనా కూడా బిజెపి గట్టిగానే నిలబడింది. అంతే కాదు..భవిష్యత్ లో ఎలా ఉండబోతున్నది కూడా ఈ ఎన్నిక ద్వారా సంకేతాలు పంపారు. అంతే కాదు ఎన్నికలకు ముందు నుంచి పొరుగు జిల్లాల యువతను దుబ్బాక నియోజకవర్గంలో పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయించటంలో బిజెపి సక్సెస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగావకాశాల కల్పన, హామీల అమలులో టీఆర్ఎస్ వైపల్యాల విషయంలో బిజెపి ప్రచారం విస్తృతంగా చేసింది. ఇది చాలా వరకూ ఆ పార్టీకి లాభించింది. దుబ్బాక ఎన్నికల అనంతరం అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత 20 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇదే సీటులో 60 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించింది. బిజెపి రెండవ స్థానంతోనే సరిపెట్టుకోనుంది. అయితే బిజెపి కూడా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News