మరో రెండు నెలలే. కొత్త సంవత్సరం రాబోతోంది. 2020 దేశానికే కాదు..ప్రపంచానికే ఓ చేదు గుర్తుగా మిగలబోతోంది. కొత్త సంవత్సరం అంటే ముఖ్యంగా యూత్ లో హుషారు...ఆ ఆనందం వేరు. అందుకే ప్రతి ఏటా ఆ ఒక్క రోజే వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అందరూ పార్టీ 'మోడ్'లోకి వెళ్లిపోతారు. అందులో ఎవరి పద్దతులు వాళ్లవి. అయితే పార్టీ మాత్రం కామన్. కొత్త సంవత్సరం అంటే కోటి ఆశలతో ముందుకెళతారు. ఇది సహజం. ఆ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది వేరే విషయం. కానీ ప్రయాణం అలా సాగాల్సిందే కదా. అయితే ఈ సారి కొత్త సంవత్సరంపై కరోనా ప్రభావం కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి. భారత్ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్ లో కరోనా 2021 ఫిబ్రవరిలో అంతం అవుతుంది అని చెబుతోంది. దీంతో 2021 కొత్త సంవత్సరం వేడుకలపై తీవ్ర ప్రభావం పడనుంది. అదే నివేదిక ముఖ్యంగా కేరళలోని ఓనం పండగ సందర్భంగా ప్రజలు గుమిగూడటం వల్ల తగ్గిన కరోనా కాస్తా మళ్ళీ విభృబించిందని నిగ్గుతేల్చింది.
ఓనంకు ముందు రోజుకు వందల సంఖ్యలో కేసులు రాగా..ఓనం తర్వాత రోజుకు కరోనా కేసులు పది వేలకు చేరాయని చెప్పారు. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే పెద్ద ఎత్తున గుమిగూడే నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు రావటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా కరోనా కారణంగా ఈ సారి మాత్రం న్యూఇయర్ జోష్ మాత్రం మిస్ కావటం పక్కా అని చెబుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విభాగాలకు అనుమతులు ఇచ్చేశాయి. అయితే కోవిడ్ నిబంధనలను మాత్రం విధిగా పాటించాలని సూచిస్తున్నాయి. నూతన సంవత్సరం వేడుకలు కూడా ఈ సారి కరోనార్పణం కావటం ఖాయం అంటున్నారు నిపుణులు. అంతా మామూలుగా ఉంటే ఇఫ్పటికే స్టార్ హోటళ్లు మొదలుకుని పలు సంస్థలు హంగామా ప్రారంభించేవి. కానీ ఈ సారి మాత్రం ఈ సీన్ ఉండదంటున్నారు.