ఏపీ సీఎం జగన్ కు 30 ఏళ్ళు శిక్ష పడే అవకాశం. అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక చెప్పిందట. అంతే చంద్రబాబు కూడా ఈ మాట చెప్పేశారు. ఎవరితో అనుకుంటున్నారా?. గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలతో మాట్లాడుతూ. ఈ వార్త మీడియాలో కూడా ప్రముఖంగానే వచ్చింది. అసలు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎదుర్కొంటున్న తీవ్ర విమర్శ ఇదే. న్యాయవ్యవస్థలోని కొంత మంది కుమ్మక్కు అయి తీర్పులను ప్రభావితం చేస్తున్నారని.ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాశారు. ఇది ఇప్పుడు దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ పై కేసులు ఉన్న మాట వాస్తవం. అందులో రహస్యం ఏమి లేదు. కోర్టులో విచారణలు పూర్తి అయి ఆధారాలు దొరికితే శిక్షలు జడ్జీలు ఖరారు చేస్తారు. అది కూడా అంత తేలిగ్గా ముందుకు సాగదు. సీబీఐ కోర్టు..ఆ తర్వాత హైకోర్టు..తర్వాత సుప్రీంకోర్టు. ఇలా వివిధ దశలు ఉన్నాయి.
కానీ చంద్రబాబునాయుడు ఏకంగా జగన్ కే పడే శిక్షా కాలాన్ని కూడా ఎవరో చెప్పారని పార్టీ నేతలతో చెప్పటం..ఆ వార్తలు కాస్తా మీడియాలో రావటంతో చంద్రబాబుపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఊతం ఇచ్చేదిలా ఉంది తప్ప..ఇది ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదని పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ న్యాయవ్యవస్థకు సంబంధించి రాసిన లేఖ ఇప్పుడు న్యాయ, రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఇది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబు కోర్టులు చేయాల్సిన పనులు శిక్షలు అవీ మాట్లాడటం వల్ల లాభం లేకపోగా మరింత నష్టం చేయటం ఖాయం అని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.