వైసీపీ సర్కారు వరసగా రెండో సారి ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ ఆమోదం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకష్ణుడు తప్పుపట్టారు. ఈ విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదా పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు పెట్టాలి కానీ ఇలా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదింపచేసుకోవటం ఏ మాత్రం సరికాదని విమర్శించారు. యనమల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేయకూడదని ఆయన కోరారు.
పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక కారణం పేరు చెప్పి బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయటం ఏ మాత్రం సరికాదన్నారు. వార్షిక బడ్జెట్ ను ఆర్డినెన్స్ రూపంలో తెచ్చే దుష్టసంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి చట్టసభలు, ప్రజలు, ప్రతిపక్షాలు ఎవరన్నా లెక్కలేదన్నారు. దేశంలో ఎక్కడా ఇలా ఆర్డినెన్స్ ల రూపంలో బడ్జెట్లు ఆమోదించటం లేదన్నారు.