తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్న వైఎస్ షర్మిల బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి బరిలోకి దిగబోతున్నది ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పార్టీ తొలి సభ నిర్వహించనున్న ఖమ్మం జిల్లాలోనే ఆమె పోటీ చేయనున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి పులివెందుల ఎలాగో..తనకు ఖమ్మం జిల్లా పాలేరు అలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు.
ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడే పార్టీ పేరుతోపాటు విధివిధానాలు ప్రకటించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే కరోనా కారణంగా బహిరంగ సభకు అనుమతి లభిస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సభ నిర్వహణ కోసం మైదానానికి అవసరమైన అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా అనుమతి రావాల్సి ఉంది. అయితే షర్మిల మాత్రం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, తాము మాత్రం సభ నిర్వహించి తీరుతామని, తమను ఎవరూ ఆపలేరని అన్నారు.