జగన్ నిర్మాణాత్మక కార్యాచారణ ప్రకటించాలి

Update: 2021-03-09 12:36 GMT

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మక కార్యాచరణ ప్రకటించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ తో మాట్లాడే అవకాశం వచ్చినా స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. కేంద్ర వైఖరిని స్పష్టంగా ప్రకటించినా రాష్ట్రంలోని బిజెపి నేతలు మాత్రం ఏమీ జరగటంలేదన్నట్లు మాట్లాడటం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటిస్తే టీడీపీ దీనికి మద్దతు ఇస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోకపోతే చరిత్రహీనులం అవుతామని వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావు మంగళవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు సాధించుకున్న ఈ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో పాదయాత్ర చేసి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పాదయాత్రకు తాము కూడా సిద్ధం అని, అందరూ కలసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు అంతా రాజీనామా చేస్తే దేశమంతా ఏపీవైపే చూస్తుందని వ్యాఖ్యానించారు. అందరూ రాజీనామా చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. వైసీపీ సభ్యులు రాజీనామా చేసిన చోట టీడీపీ పోటీకూడదని పెట్టదని ప్రకటించారు.

Tags:    

Similar News