బిజెపి వాళ్లు చెపితే బెయిల్ రద్దు అవుతుందా?

Update: 2021-04-06 13:28 GMT

కోర్టులు వీళ్లు చెప్పినట్లు చేస్తాయా?. సజ్జల ఫైర్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి వాళ్లు చెపితే బెయిల్ రద్దు అవుతుందా?. అంటే కోర్టులు తాము చెప్పినట్లు నడుస్తాయని చెప్పదలచుకున్నారా? అంటూ బిజెపి, జనసేన నేతల తీరుపై మండిపడ్డారు. త్వరలోనే సీఎం జగన్ బెయిల్ రద్దు అవుతుంది అని..జగన్ తోపాటు చంద్రబాబు కూడా జైలుకు వెళతారని ఏపీ బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ థియోదర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారని అన్నారు. మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ''బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది.

సీఎం జగన్‌ని ఎదుర్కొలేకనే తెర వెనక రాజకీయాలు నడుపుతున్నారు. పవన్ కు సొంత అభిప్రాయం అంటూ ఏమి లేదు. ఆయన రాత్రి ఓ పార్టీతో.. పగలు ఓపార్టీతో తిరుగుతుంటారు'' అని ఎద్దేవా చేశారు. ''ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు సీఎం జగన్‌కు అండగా నిలిచారు. ఓట్ల రూపంలో తమ ఆశీర్వాదాన్ని తెలుపుతున్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను మెచ్చి జనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పోయారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చినా హామీలన్నింటిని అమలు చేశాం'' అని సజ్జల తెలిపారు. ఏపీలో తమ ప్రభుత్వాన్ని అస్ధిరపర్చేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News