ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కెసీఆర్ ఫ్యామిలీ ఎందుకు నిరసనలకు దూరంగా ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పుకునే కెసీఆర్ కానీ..ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్, మరో మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులు ఎందుకు ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొనలేదన్నారు. అసలు సీఎం ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని..మంత్రి కెటీఆర్ మాత్రం ప్రారంభోత్సవాలు..రిబ్బన్ కటింగ్ ల్లో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు సమావేశాల్లో సంతోష్ రావు చెట్లు నాటే పనుల్లో ఉండిపోయారన్నారు. నేరుగా మోడీకి వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటే ఈడీ, ఐటి దాడులు జరుగుతాయని భయపడ్డారా అని ప్రశ్నించారు. కెసీఆర్ చెంచాలు,...చెప్పులు మోసేవారితో మాత్రమే నిరసన ప్రదర్శనలు చేశారని..ఎందుకు కెసీఆర్ ఫ్యామిలీ మాత్రం నేరుగా ఇందులో పాల్గొనలేదని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాసయాదవ్, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్ లు ఎవరు?. తెలంగాణ ఉద్యమకారులా అని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటును అవమానించే రీతిలో మాట్లాడితే టీఆర్ఎస్ ఎంపీలు కనీసం నిరసనగా కూడా తెలియజేయలేదన్నారు. ముందుగా మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టి..పార్లమెంట్ లో నిరసన తెలిపింది తామేనన్నారు. సీఎం కెసీఆర్ తనను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఏ మాత్రం సహించరని, కానీ తెలంగాణ గురించి మాట్లాడితే మాత్రం మౌనంగా ఉన్నారని అన్నారు. ఆయన చక్రవర్తిలాగా భావిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనకు సమస్య వస్తే తెలంగాణకు సమస్య వచ్చినట్లు..తన కడుపు నిండితే తెలంగాణలో అందరికీ కడుపు నిండిందనే తీరుగా కెసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు సోనియా తీసుకున్నారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా టీఆర్‌ఎస్ ఎంపీలు నిలిచారన్నారు. ఉలిక్కిపడి ఇప్పుడు టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలకు దిగారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.