పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కారు పతనం

Update: 2021-02-22 07:34 GMT

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. పుదుచ్చేరిలో బిజెపి తన మోడల్ ఆపరేషన్ ను విజయవంతం చేసింది. ఎన్నికలకు కొద్ద నెలల ముందు పుదుచ్చేరి ప్రభుత్వాన్ని పడగొట్టింది. మరి వచ్చే ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ కు అనుకూలిస్తుందా?. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మేలు చేస్తుందా?. వేచిచూడాల్సిందే. సోమవారం నాడు జరిగిన పరిణామాల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇన్ ఛార్జి లెప్టినెంట్ గవర్నర్ తమిళ్ సై ఇచ్చిన గడువు ప్రకారం నారాయణస్వామి సోమవారం నాడు సభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అవసరమైన సంఖ్యబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ వీపీ శివకొలందు ప్రకటించారు. సీఎం నారాయణస్వామి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ మీద నిప్పులు చెరిగారు నారాయణ స్వామి. కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కలిసి‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.

2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రస్ పార్టీ దక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగింది. గత ఏడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్‌ తిగురుబావుటా ఎగురవేశారు. అప్పటి నుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్‌ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్‌ రాజీనామాతో నారాయణ సర్కారు పతనానికి దారితీసింది.

Tags:    

Similar News