టాలీవుడ్ లో ఎఫ్ 2 సినిమా ఓ కొత్త చరిత్ర రాసిందనే చెప్పాలి. దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కొత్త తరహా కామెడీ చూపించారు అప్పట్లో. మరి అలాంటి సినిమాకు కొనసాగింపుగా ఎప్ 3 వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు థియేటరల్లో సందడి చేసింది. ఎఫ్ 2 సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి ఇంట్లో ఉండే సన్నివేశాలు..పెళ్ళిళ్ల సమయంలో జరిగే తంతును అద్భుతంగా తెరకెక్కించటంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎఫ్3 సినిమా అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుందని అనిల్ రావిపూడి ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. సినిమా అంతా నిజంగానే అలాగే నడిచింది. ఎఫ్3లోనూ సేమ్ ఎఫ్ 2 హీరోల తరహాలోనే సేమ్ ఫ్యామిలీని కూడా కొనసాగించారు. కొత్తగా సునీల్, అలీ, మురళీశర్మ క్యారెక్టర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఎలాగైనా కోట్లు సంపాదించి జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు. వీరిలాగే ఓ ఇంట్లో పనిచేసే మెహరీన్ వాళ్ళ ఖరీదైన కార్లలో తిరుగుతూ కోట్ల రూపాయలు ఉండే కుర్రోడిని బుట్టలో వేసుకోవాలనే పనిలో తిరుగుతుంటది.
మెహరీన్ హంగామా చూసి ఆమె కోటీశ్వరుడి కూతురు అని భ్రమపడి అప్పులు చేసి మరీ ఆమెను బుట్టలో వేసుకునే పనిచేస్తాడు వరుణ్ తేజ్. అందరి దగ్గర డబ్బులుగుంజి హోటల్ నడిపే ఫ్యామిలీ తమన్నా, మెహరీన్ లది. తాము అనుకున్న కోట్లాది రూపాయలు సంపాదించేందుకు హీరోలు వెంకటేష్ చివరకు ఓ కమిషనర్ ఇంట్లో దొంగతనం చేస్తారు. చివరకు పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ తప్పదని ఆత్మహత్యలకు సిద్ధపడుతున్న తరుణంలో ఓ వార్త చూసి ఆగిపోతారు. అసలు ఆ వార్త ఏంటి?. తర్వాత ఏమి జరిగింది అన్నదే సినిమా. ఈ సినిమాలో రేచీకటి వ్యక్తిగా వెంకటేష్, నత్తి ఉన్న వ్యక్తిగా వరుణ్ తేజ్ లు తమ పాత్రలను ఎంతో ఈజ్ తో పూర్తి న్యాయం చేశారు.
వాళ్లే ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. వెంకటేష్ కంటే వరుణ్ తేజ్ క్యారెక్టర్ వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎఫ్ 3 సినిమా ఫస్టాఫ్ ఓ పది నిమిషాలు తప్ప.. అంతా సరదా సరదాగా సాగిపోతుంది. తమన్నా ఫ్యామిలీ ఇచ్చే జర్క్ లకు షాక్ కు గురయ్యే సమయంలో తాతయ్య ఓ తాతయ్య సాంగ్ సినిమా మొత్తంలో హైలెట్ గా నిలుస్తుంది. సెకండాఫ్ లో కథను నడిపించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి పిల్లలు మొబైల్స్ కు ఎలా బానిసలుగా మారారు..వాళ్ళను అందులో నుంచి బయటపడేసేందుకు దివాళా తీసే దశలో ఉన్న ఓ బొమ్మల ఫ్యాక్టరీని తిరిగి ఎలా టాప్ రేంజ్ లో తీసుకొస్తాడు అన్న కథతో నడిపించారు. సెకండాప్ లో ఎంట్రీ ఇచ్చే సోనాల్ చౌహన్ పాత్ర నిడివి చాలా తక్కువే. పూజా హెగ్డె ప్రత్యేక గీతంగా కూడా పెద్దగా క్లిక్ కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎఫ్ 2లో కామెడీ పూర్తి స్థాయిలో ఉంటే ఎఫ్ 3లో మాత్రం కామెడీ అక్కడక్కడే అని చెప్పుకోవాలి. ఎఫ్ 3 నెంబర్ పెరిగింది..ఎంటర్ టైన్ మెంట్ తగ్గింది.
రేటింగ్. 2.75\5