అనిల్, చిరు సంక్రాంతి మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా!(Mana Shankara Varaprasad Garu Review)
చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా 2023 లో బాక్స్ ఆఫీస్ ముందుకు రాగా దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా మొదలుపెట్టారు. కానీ ఈ సినిమా టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఈ మూవీ ని పక్కన పెట్టి మరీ గత సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తో కలిసి మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనుకున్న టైం లో ఈ సినిమా పూర్తి చేసి కలిసి వచ్చిన సంక్రాంతికి అంటే ఈ జనవరి 12 న విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజు ముందు గానే అంటే జనవరి 11 రాత్రి నుంచే తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ల్లో కూడా ఈ సినిమా ప్రీమియర్స్ షోలు పెద్ద ఎత్తున వేశారు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ కు మంచి స్పందన దక్కింది. ఈ సంక్రాంతి రేస్ లో నిలిచిన మూవీ ల్లో ప్రభాస్ రాజాసాబ్ కు మిశ్రమ స్పందనలు రాగా..ఇప్పుడు అందరి చూపు చిరంజీవి సినిమాపై పడింది అనే చెప్పాలి.
మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఒక కేంద్ర మంత్రి దగ్గర పని చేస్తుంటాడు. చిరంజీవి తన లవ్ స్టోరీ తో పాటు ....విడాకుల స్టోరీ ఆయనకే చెపుతాడు. దేశంలోనే వరసగా మూడు సార్లు బెస్ట్ పారిశ్రామికవేత్త అవార్డు గెలుచుకున్న నయనతార ను పెళ్లిచేసుకుంటాడు చిరంజీవి. ఈ పెళ్లి తండ్రికి ఇష్టం లేకపోయినా చేసుకుంటుంది....తర్వాత కొద్ది కాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో విడిపోతారు. తర్వాత కనీసం శంకర వరప్రసాద్ కు పిల్లలను చూసే ఛాన్స్ కూడా ఇవ్వరు. శంకర వరప్రసాద్ కేంద్ర మంత్రి దగ్గర పని చేస్తుండంతో ఒక సిఫారసు లేఖతో తన పిల్లలు చదివే స్కూల్ కు పీఈటీ గా వెళ్లి వాళ్లకు దగ్గర అవుతాడు. విషయం తెలుసుకుని శశిరేఖ వాళ్ళను తన ఇంటికి తీసుకొచ్చేస్తుంది. తర్వాత శశిరేఖ తండ్రిపై ఎటాక్ జరుగుతుంది. తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు రాష్ట్ర పోలీస్ లు ఏ మాత్రం సరిపోరు అని భావించి కేంద్రం నుంచి సాయం కోరటంతో తిరిగి శశిరేఖ ఇంటికి శంకర వరప్రసాద్ తన టీం తో ఎంట్రీ ఇస్తాడు. అసలు శశిరేఖ తండ్రి పై దాడి కి ప్రయత్నం చేసింది ఎవరు..దీన్ని శంకర వరప్రసాద్ ఎలా సాల్వ్ చేసాడు అన్నదే మూవీ.
ఈ సినిమాలో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఫస్ట్ ఫైట్ దగ్గర నుంచి ప్రతి సన్నివేశంలో కూడా చిరంజీవి తనదైన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పటిలాగానే కథ కంటే కూడా సినిమా ను ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించటంపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. కథలో పెద్దగా దమ్ములేకపోయినా సినిమా ని నడిపించిన తీరు ఇక్కడ కీలకంగా మారింది . చిరంజీవిని పాటలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా స్టైలిష్ గా చూపించాడు దర్శకుడు. హీరోయిన్ నయనతార శశిరేఖ పాత్రలో తన యాక్షన్ తో అదరగొట్టింది. ఈ సినిమాలో చిరు, నయనతార కాంబినేషన్ మంచిగా సెట్ అయింది. దర్శకుడు అనిల్ రావిపూడి మరో సారి ఈ సినిమాలో కూడా బుల్లి రాజు పాత్రను ప్రవేశపెట్టి కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు.
హీరో వెంకటేష్ సెకండ్ హాఫ్ లో వెంకీ గౌడ్ పాత్రతో ఎంట్రీ ఇస్తాడు. ఉండేది కొద్దిసేపే అయినా కూడా ఉన్నంత సేపు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి మంచి ఫన్ జెనరేట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి చేసే హంగామా కూడా ఆకట్టుకుంటుంది. మూవీ క్లైమాక్స్ లో చిరంజీవి తల్లి పాత్ర పోషించిన జరీనా వహాబ్, నయనతార కు మధ్య వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉంటాయి. అనిల్ రావిపూడి తన కోర్ స్ట్రెంత్ అయిన ఫ్యామిలీ రిలేషన్స్ ను టార్గెట్ చేసుకుని కథను నడిపిస్తూ...మధ్య మధ్యలో కామెడీ జొప్పించి సంక్రాంతి పండగ కు మరో హిట్ ను అందించాడు అని చెప్పొచ్చు. సినిమా టేకింగ్ అంతా రిచ్ గా ఉంది...బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. చిరంజీవి టీం లో ఆఫీసర్స్ గా కేథరిన్ థ్రెసా, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం సందడి చేస్తారు. ఓవరాల్ గా చూస్తే మన శంకర వరప్రసాద్ గారు మూవీ తో దర్శకుడు అనిల్ రావిపూడి పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంగేజ్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ అంతా సినిమా చూసేలా ఈ మూవీ ని డిజైన్ చేశారు.
రేటింగ్ : 3 /5