'అందనీ ఆకాశం దించావయ్య మాకోసం' ఈ చరణం నూటికి నూరుపాళ్లు నిజం. ఎయిర్ డెక్కన్ విమాన సర్వీసులు వచ్చిన తొలి రోజుల్లో చాలా మంది భావన ఇదే. ప్రజలు అంత కవితాత్మకంగా చెప్పకపోవచ్చు కానీ..ఆ భావన మాత్రం చాలా మంది ఫీల్ అయ్యారు..దేశీయ విమానయాన రంగంలో ఎయిర్ డెక్కన్ ఓ సంచలనం. అసలు కలలో కూడా విమానం ఎక్కుతామని ఊహించని వారికి కూడా విమానయానం దగ్గర చేసిన ఎయిర్ లైన్స్ అదే. రూపాయికి విమాన టిక్కెట్ అంటే విస్తుపోవటం ప్రజల వంతు అయింది. ఆ తర్వాత ఐదు వందలు..వెయ్యి రూపాయల టిక్కెట్లతో ఆకాశాన్ని నిజంగా నేలకు దించారు కెప్టెన్ గోపీనాథ్. ఆయన జీవిత కథలోని ముఖ్యాంశాలు తీసుకుని తెరకెక్కిన సినిమానే 'ఆకాశం నీ హద్దురా'. హీరో సూర్య, హీరోయిన్ అపర్ణా బాలమురళి. ఓ పల్లెటూరులో ఉంటే టీచర్ కొడుకు మహ (హీరో సూర్య) ఎయిర్ లైన్స్ ప్రారంభించి..సామాన్యులకు కూడా విమానయానం చేరువ చేయాలని చూస్తాడు.
ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతాడు. లో కాస్ట్ ఎయిర్ లైన్ బిజినెస్ మోడల్ కు వెంచర్ క్యాపిలిస్టులు నిరాకరించటం..విమానయాన రంగంలో అప్పటికే పాతుకుపోయిన ఎయిర్ లైన్స్ యాజమానులు, వారితో కలసి డీజీసీఏ అధికారులు కొత్త ఎయిర్ లైన్స్ వస్తే ఎలా అడ్డుకుంటారనే విషయాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో పలుమార్లు రతన్ టాటా ప్రస్తావన కూడా తీసుకొస్తారు. కెప్టెన్ గోపీనాథ్ పాత్రకు సూర్య జీవం పోశారు. ఎయిర్ డెక్కన్ విమాన సర్వీసులు ప్రారంభం వెనక ఎంత పెద్ద కథ నడిచిందో ఈ సినిమా బహిర్గతం చేసింది. హీరోయిన్ అపర్ణా బాల మురళీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సూర్య, అపర్ణా బాల పెళ్లి చూపుల సీన్ దగ్గర నుంచి బేబీ బేకరీ సీన్లు కూడా మంచి నవ్వు తెప్పిస్తాయి.
ఓవరాల్ గా సినిమా అంతా సూర్య వన్ మ్యాన్ షోగానే సాగుతుంది. ఎప్పటికప్పుడు సూర్య ప్రయత్నాలను అడ్డుకునే ప్రముఖ ఎయిర్ లైన్స్ అధిపతిగా పరేష్ రావల్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారిగా మోహన్ బాబు పాత్ర చిన్నదే అయినా..ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమా క్లైమాక్స్ లో 'నన్ను ఆపాలనుకున్నా..ఏమి పీకాలనుకున్నా పంట పండించేవాడు కూడా ప్లేన్ ఎక్కేశాడు. ఇంకా చాలామంది ఎక్కుతారు. ఆకాశం ఏమైనా నీ అబ్బ సొత్తు అరా?' అంటూ సూర్య చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. సినిమా నిడివి మరీ ఎక్కువ కావటం, అంతా తమిళ నటులు ఎక్కువగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాకు కథ, దర్శకత్వం సుథ కొంగర అందించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో గురువారం నాడు విడుదలైంది.
రేటింగ్. 2.5/5