హీరో యష్ ఫాన్స్ కు బిగ్ షాక్. మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రొమోషన్స్ నిర్వహించకపోవడంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా విడుదల వాయిదాను అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్ ...తదుపరి విడుదల తేదీ ని కూడా వెల్లడించింది. దీని ప్రకారం టాక్సిక్ మూవీని జూన్ 4 న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థలు కెవి ఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఒక ప్రకటనలో వెల్లడించాయి. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించాం అన్నారు. అయితే ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణం గా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలకు చేరువ కావాలన్న తమ లక్ష్యం నెరవేరే అవకాశం లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమ నిర్ణయాన్ని ప్రేక్షకుల అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 4 న భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 19 న దురంధర్ 2 వస్తుండంతో టాక్సిక్ మూవీ ఈ పోటీని తట్టుకుని నిలబడగలుగుతుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్న వేళ ఈ సినిమా విడుదల వాయిదా ప్రకటన వెలువడటం కీలకంగా మారింది అనే చెప్పాలి. సూపర్ డూపర్ హిట్ అయిన కెజీఎఫ్ రెండు పార్ట్ ల తర్వాత యష్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయలేకపోయింది. పైగా టాక్సిక్ మూవీ లో హీరో రాయ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో లో బోల్డ్ కంటెంట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.