విభజన చట్టం ప్రకారం ఏపీలోని రాజధాని భవనాల నిర్మాణం..మౌలికసదుపాయాల కల్పనకు కేంద్రమే నిధులు కేటాయించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం దీనికి కొంత మేర నిధులు కేటాయించింది. మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పేరుతో భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. జగన్ సీఎం అయిన తర్వాత తొలి రోజుల్లో కేంద్రానికి ఇచ్చిన వినతిపత్రాల్లో రాజధాని కోసం నిధులు కోరారు. తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి రావటం..చివరకు ఆ బిల్లుల ఉపసంహరణ కూడా జరిగిపోయింది. అయితే మళ్లీ అవే బిల్లులను తెస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం అమరావతి పేరుతో సచివాలయ నిర్మాణం కోసం నిధుల కేటాయింపు చేయటం ఆసక్తికరంగా మారింది.
2022-23 బడ్జెట్‌లో కేంద్రం ఈ కేటాయింపులను చేసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‌లో ప్రొవిజన్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులను కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి 1214 కోట్ల రూపాయలను అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం 1126 కోట్ల రూపాయలను కేంద్రం అంచనా వేసింది. జీపీవోఏ భూసేకరణ కోసం 6.69 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా పేర్కొంది. జగన్ సర్కారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను వైజాగ్ కు తరలించాలని ప్రతిపాదించింది. అక్కడే సచివాలయంతోపాటు ఇతర ప్రధాన భవనాలు రానున్నాయి. మరి ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో అమరావతిలో సచివాలయం రానున్నట్లు పేర్కొన్నారు.