అప్పుడు ఎన్టీఆర్ తో ..ఇప్పుడు రామ్ చరణ్ తో!

Update: 2023-03-18 04:37 GMT

ఇది ఇప్పుడు టాలీవుడ్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లు చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటది. వాళ్ళు ఏమి చేసినా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో రామ్ చరణ్ విషయంలోనూ అమిత్ షా అలాగే వ్యవహరించారు అనే చర్చ సాగుతోంది. ఆస్కార్ వేడుకల్లో పాల్గొని రామ్ చరణ్ నేరుగా ఢిల్లీ లో ల్యాండ్ అయ్యారు. అదే సమయంలో దర్శకుడు రాజ మౌళి, సంగీత దర్శకుడు కీరవాణి టీం హైదరాబాద్ చేరుకుంది.వీరి అందరికంటే ముందే ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. నిజానికి ఆస్కార్ అవార్డు పై చిత్ర యూనిట్ ను అబినందించటానికి అయితే అందరిని పిలిచి ఉండేవారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ప్రత్యేకంగా చిరంజీవికి ఆహ్వానం పంపారు. అదే అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అదే తరహాలో శుక్రవారం సాయంత్రం అమిత్ షా ఢిల్లీ లో చిరంజీవి, రామ్ చరణ్ లతో ప్రత్యేకగా సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. దీని వెనక కూడా రకరకాల లెక్కలు ఉంటాయని చెపుతున్నారు. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీ తో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇలాగే ఎన్టీఆర్ తో హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

                                         అటు మోడీ అయినా...ఇటు అమిత్ షా అయినా నేరుగా ఏమి చెప్పరు...తమ భేటీల ద్వారానే ప్రజలకు పంపాల్సిన సంకేతాలు పంపుతారు అనే విషయం తెలిసిందే. అవసరం అయితే సినిమా రంగానికి చెందిన వాళ్ళను ఎలా వాడుకోవాలో బీజేపీ కి తెలిసినంతగా మరో పార్టీ కి తెలియదు అనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అప్పుడు ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేక భేటీ అయినా...ఇటు చిరంజీవి, రాంచరణ్ ప్రస్తుత భేటీ అయినా నేరుగా రాజకీయాలతో సంబంధం లేక పోయినా కూడా వీటి అంతిమ లక్ష్యం మాత్రం రాజకీయ కోణం లోనే సాగుతుంది అని చెప్పొచ్చు.నాయకులు ఎవరైనా రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఏ పని చేయరనే విషయం తెలిసిందే. మరో సారి ప్రధాని మోడీ ఆర్ఆర్ఆర్ టీం మొత్తాన్ని ఆహ్వానించే ఛాన్స్ ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతానికి చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ సాంకేతికంగా బీజేపీ తోనే పొత్తులో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కినందుకు,ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నందుకు ఈ భేటీలో అమిత్ షా వీరికి అభినందనలు తెలిపారు. ఈ భేటీలో రామ్ చరణ్ ను అమిత్ షా శాలువా తో సత్కరించగా...అమిత్ షా కు చిరంజీవి శాలువా కప్పి సత్కరించారు.

Tags:    

Similar News