విజయసాయిరెడ్డి అనర్హత పిటీషన్ ను కొట్టేసిన రాష్ట్రపతి

Update: 2020-09-07 15:29 GMT

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై దాఖలైన అనర్హత పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోసిపుచ్చారు. ఆయనకు అనర్హత వర్తించదని కోవింద్‌ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి లాభదాయక పదవి నిర్వహిస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదుపై రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం, న్యాయస్థానాల తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి, విజయసాయి రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ని కొట్టివేశారు.

వాస్తవానికి తొలుత ఏపీ సర్కారు విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత తప్పు తెలుసుకుని ఈ పోస్టును లాభదాయక పోస్టుల జాబితా నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. విజయసాయిరెడ్డి జీవో 75 ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధినిర్వహణలో, ఏపీ పర్యటనలో కేవలం రాష్ట్ర అతిథిగా మాత్రమే ఉన్నారని జీవోలో పేర్కొన్నారు.

 

Similar News