ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిస్థితి విషమం

Update: 2020-09-24 13:27 GMT

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. గత 24 గంటల్లో పరిస్థితిలో మార్పు వచ్చిందని ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. పూర్తి స్థాయిలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు 5న కరోనాతో బాలసుబ్రమణ్యం ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన కరోనా నుంచి కోలుకున్నా ఇతర సమస్యలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. గత నలభై రోజులుగా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఎస్పీ బాలు తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై అభిమానులకు అప్ డేట్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆహారం కూడా తీసుకున్నట్లు తనయుడు చరణ్ వెల్లడించారు. త్వరలోనే బయటకు వస్తారని పేర్కొన్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వచ్చాయి. బాలసుబ్రమణ్యాన్ని వెంటిలేటర్ పై ఉంచి..ఎక్మో ద్వారా బాలసుబ్రమణ్యానికి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. బాలు కోలుకుని త్వరలో బయటకు వస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన ఆరోగ్యం విషమించినట్లు వార్తలు రావటం ఆయన అభిమానులను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.

 

Similar News