తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ

Update: 2020-09-11 14:51 GMT

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క అంతర్వేది ఘటనకే పరిమితం చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పింక్ డైమండ్ తోపాటు ఇతర ఆభరణాల అంశానికి విస్తరింపచేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కోరారు. అంతర్వేది ఘటనతోపాటు పిఠాపురం, కొండబిట్రగుంట ఘటనల వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం అంటే సమస్య పరిష్కారం అయినట్లు కాదని, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడదని జనసేన కోరుకుంటోందని పేర్కొన్నారు. ‘అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ విచారణ చేయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. తిరుమల శ్రీవారికి, శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ దర్యాప్తు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే, మన సనాతన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలి.’ అన్నారు.

Similar News