గండికోట నిర్వాసితులపై లాఠీచార్జ్ దారుణం

Update: 2020-09-08 12:16 GMT

గండికోట రిజర్వాయర్ రెండవ దశ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల విషయంలో ఏపీ సర్కారు జులుం పదర్శించటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళాలన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని రెండవ దశ కోసం తాళ్ల ప్రొద్దుటూరుతోపాటు మరో 16 ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా ఖాళీచేయించడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా.. పునరావాసం కల్పించకుండా హుటాహుటిన ఖాళీ చేయించడం బాధాకరం. పరిహారం ఇచ్చి, పునరావాస వసతులు కల్పించాకే ఖాళీ చేస్తామని నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తే.. వారిపై పోలీసు బెటాలియన్ దింపారు.

పిచ్చుకమీద బ్రహ్మాస్తం లాగా నిర్వాసితులపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి భయబ్రాంతులకు గురి చేయడం సరైన పద్దతి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించడం తప్ప... నిర్వాసితులకు సరైన న్యాయం జరిగిన దాఖలాలు లేవు. బాధితులకు ముఖ్యమంత్రే భరోసా కల్పించాలి. లేదంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ప్రజలకు ఇంత అన్యాయం జరిగిందనే సంకేతాలు బయటకు వెళ్తాయి. నిర్వాసితులకు సంపూర్ణ పరిహారం ఇవ్వాలి, న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

 

Similar News