బిన్ లాడెన్ మేనకోడలు ట్రంప్ కు మద్దతుగా ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎవరూ ఊహించని వ్యక్తి మద్దతు లభించించింది. అంతే కాదు..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైతే..9/11 తరహా దాడి మరోసారి జరగొచ్చని వ్యాఖ్యానించి కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?. అమెరికాను ఉలిక్కిపడేలా చేసిన 9/11 దాడి సూత్రదారి ఒసామా బిన్ లాడెన్ మేనకోడలు నూర్ బిన్ లాడెన్ కావటం విశేషం. నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్ కు మద్దతుగా నూర్ బిన్ లాడెన్ వ్యాఖ్యలు చేయటం కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దేశాన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుండి రక్షించగలరని, ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలవాలని ఆమె వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూర్ బిన్ లాడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాగా విస్తరించిందని ఆరోపించిన ఆమె బైడెన్ అధ్యక్షుడైతే అమెరికాకు ప్రమాదమని హెచ్చరించారు. వామపక్షవాదులు ఎప్పుడూ రాడికలిజంతో పొత్తు పెట్టుకున్నారని నూర్ ఆరోపించారు. ట్రంప్ తన హయాంలో ఉగ్రవాదులను నిర్మూలించడంద్వారా అమెరికాను భయంకరమైన ఉగ్రదాడుల నుంచి కాపాడారని నూర్ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లితో కలసి మూడేళ్ల వయస్సు నుంచి అనేకమార్లు అమెరికాకు వెళ్లానన్నారు. 2015లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీకి నిలిచినప్పటినుంచి ఆయనకు తాను ఫ్యాన్ అయిపోయానని, ఇపుడు కూడా ట్రంప్‌ను ఖచ్చితంగా ఎన్నుకోవాలన్నారు.