చిత్తూరు జిల్లాలో టీడీపీ, బిజెపిల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా పలువురు నేతలను పోలీసులు గృహ నిర్భందంలో పెట్టారు. అయినా కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. వీళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిక్లరేషన్ ఇస్తే సీఎం జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటని టీడీపీ, బిజెపి నేతలు ప్రశ్నించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం పట్టువస్త్రాలు దంపతులు ఇవ్వాలని..సీఎం జగన్ కూడా అలాగే చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే విపక్షాల తీరును అధికార వైసీపీ తప్పుపడుతోంది. గతంలో ఎప్పుడూ లేని ఈ వివాదాన్ని ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు బుధవారం సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీ నుంచి నేరుగా తిరుమల చేరుకోనున్నారు.