కన్నుమూసిన జశ్వంత్ సింగ్

Update: 2020-09-27 05:24 GMT

బిజెపి వ్యవస్థాపక సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు పేరుంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జశ్వంత్‌ సింగ్‌ కీలక శాఖలు చేపట్టారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల్లాంటి కీలక శాఖలన్నింటినీ నిర్వహించిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఇక 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు జశ్వంత్‌ కూడా కాందహార్‌ వెళ్లారు. ఇక 2014లో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జశ్వంత్ సింగ్‌పై బీజేపీ వేటు వేసింది.

అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. అలాగే 2018 రాజస్తాన్‌ ఎన్నికల​ సందర్భంగా జశ్వంత్‌సింగ్‌ కుమారుడు మన్వేంద్ర సింగ్‌ కూడా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. జశ్వంత్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్‌ చేశారు. పలువురు బీజేపీ నేతలు జశ్వంత్‌ సింగ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.

 

Similar News