ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు ఈ భేటీ సాగింది. వైసీపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల అంశంతోపాటు అమరావతి, ఫైబర్ నెట్ తదితర ప్రాజెక్టులపై సీబీఐ విచారణ అంశంపై అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు. బుధవారం నాడు కూడా జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం అక్కడ నుంచే సీఎం జగన్ నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్ళనున్నారు.