ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. విభజన చట్టంలో ఒక్కటే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానుల విషయంలో పూర్తి నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని పేర్కొంది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం ఆర్ధిక సాయం మాత్రమే చేస్తుందని తెలిపారు.
అదే సమయంలో రాజధాని ప్రాంతంలోనే ప్రధాన హైకోర్టు ఉండాలనే నిబంధన కూడా ఏమీలేదని స్పష్టం చేశారు. సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు పెట్టిందని,హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం ఉండబోదని మరోసారి తేల్చిచెప్పారు.