అన్ లాక్ ల దశలో ఆదాయం గాడిన పడుతుందని భావించిన సర్కారుకు షాక్. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు తగ్గటం ఆర్ధిక వ్యవస్థపై ఆందోళన రేపుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టాలనే లక్ష్యంతో ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకూ ఆంక్షలు ఎత్తేశారు. అయినా కూడా ఆర్ధిక వ్యవస్థలో కదలిక ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఆగస్టు జీఎస్టీ వసూళ్ళు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆగస్ట్ లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ 86,449 కోట్లుగా నమోదయ్యాయి.
జులై జీఎస్టీ వసూళ్లతో (87,422 కోట్ల రూపాయలు) పోలిస్తే ఆగస్ట్ వసూళ్లు స్వల్పంగా పడిపోవడం గమనార్హం. గడిచిన ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ మొత్తంలో ఆగస్ట్ వసూళ్లు 88 శాతంగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2019 ఆగస్ట్ లో 98,202 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్ట్ లో వసూలైన జీఎస్టీలో కేంద్ర జీఎస్టీ 15,906 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ వాటా 21,064 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ 42,264 కోట్లు, సెస్ కింద 7215 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.