అంతర్వేది ఘటన..సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ

Update: 2020-09-11 07:32 GMT

అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్‌ 6, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. సెప్టెంబర్‌ 5వ తేదీ శనివారం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది.

నిజాలు నిగ్గుతేల్చాలనే ఉద్ధేశ్యంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ రథం దగ్దం ఘటనతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కంది. బిజెపి, హిందు మత సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. బిజెపి, జనసేనలు అయితే ప్రత్యక్ష ఆందోళనలకు దిగాయి. ఈ తరుణంలో ఎవరూ ఊహించని రీతిలో సీఎం జగన్ గురువారం నాడే సీబీఐ విచారణకు ఆదేశించనున్నట్లు ప్రకటించారు.

 

Similar News