తమిళనాడు గవర్నర్ కు కరోనా

Update: 2020-08-02 14:42 GMT

తమిళనాడు రాజ్ భవన్ లో పెద్ద ఎత్తున వచ్చిన కరోనా కేసులు..ఇప్పుడు ఏకంగా గవర్నర్ ను కూడా తాకాయి. తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ కరోనా బారిన పడ్డారు. పురోహిత్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రి నిర్ధారించింది. గవర్నర్‌ను హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంచి కొంతమంది డాక్టర్లతో కూడిన బృందం పర్యవేక్షించనుంది. భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే కావేరి ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.

అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కావేరి ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు 84 మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు, సెక్యూరిటీ, ఫైర్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన వారే ఉన్నారు. ఆ క్రమంలోనే రాజ్‌భవన్‌ ప్రధాన బిల్డింగ్‌లో ఎవరూ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అదే సమయంలో గవర్నర్‌తో కూడా ఎవరూ కూడా కాంటాక్ట్‌ కాలేదని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు.

Similar News