అయోధ్యపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

Update: 2020-08-04 10:20 GMT

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అయోధ్య అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు రామమందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్న విషయం తెలిసిందే. అయోధ్య అంశంపై పార్టీ వైఖరికి సంకేతం అన్నట్లు ఆమె ‘రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు’ అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు ప్రతీక అయిన రాముడు అందరితో ఉంటాడని ప్రియాంక హిందీలో ట్వీట్‌ చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జరిగే భూమిపూజకు కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్వాగతిస్తూ తీర్మానించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో అతిథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇప్పటికే అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబు అయింది.

 

Similar News