కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Update: 2020-08-28 16:39 GMT

తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ తుది శ్వాస విడిచారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోపాటు ఎంపీగా ఉన్నారు. వసంతకుమార్ వయస్సు 70 సంవత్సరాలు. కోవిడ్‌-19కు చికిత్స పొందుతూ చెన్నయ్ లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వసంత్‌కుమార్‌కు ఎక్మో సాయంతో అపోలో వైద్యులు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోవిడ్‌-19 లక్షణాలు తీవ్రం కావడంతో ఈనెల 10న ఆయనను ఆస్పత్రికి తరలించారు. మూడు వారాల పాటు కరోనా వైరస్‌తో పోరాడిన వసంత్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం 6.56 గంటలకు మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తమిళనాడులో అతిపెద్ద గృహోపకరణాల రిటైల్‌ చైన్‌ వసంత్‌ అండ్‌ కోను ఆయన స్ధాపించారు. వసంత్‌కుమార్‌ తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ చీఫ్‌ కుమారి అనంతన్‌ సోదరుడు కాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆయన సమీప బంధువు. 2006లో వసంత్‌కుమార్‌ తొలిసారిగా నంగునెరి నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కన్యాకుమారి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ, అప్పటి కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌పై ఘనవిజయం సాధించారు.

Similar News