జగన్ ది నమ్మకద్రోహం..వెన్నుపోటు

Update: 2020-08-03 13:45 GMT

సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ది నమ్మకద్రోహం అని..ఐదు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తనకు మ్యానిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్దీత అని చెప్పే జగన్..మూడు రాజధానుల అంశాన్ని అందులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అమరావతిని కొనసాగిస్తామని ప్రకటించి ప్రజలను వంచించి గెలిచిన తర్వాత మార్పులు చేయటం ద్రోహం చేయటం కాదా అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీలోనే అమరావతికి అంగీకరించారని..ఆ పార్టీకి చెందిన నేతలు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి మొదలుకుని మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతోపాటు పలువురు నేతలు అమరావతికి అనుకూలం చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు.

ఆయన సోమవారం నాడు జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేసినందున అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని..దీనికి జగన్ కు 48 గంటల సమయం ఇస్తున్నామని తెలిపారు. తాము ఎన్నికలకు రెడీగా ఉన్నామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేస్తారన్నారు. జగన్ స్పందన చూసి 48 గంటల తర్వాత తమ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటామన్నారు. ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే తాము ఇక అసలు రాజధాని అంశమే ప్రస్తావించం అని చంద్రబాబు ప్రకటించారు. రాజధాని అనేది ఓ కులానికి..ప్రాంతానికో సంబంధించిన అంశం కాదని..ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమన్నారు.

 

Similar News